Published : 12 May 2022 23:29 IST

Ashwin : బ్యాటింగ్‌ ఆర్డర్‌ కోసం ప్రత్యేకంగా లైసెన్స్‌ ఏమీ ఇవ్వలేదు: అశ్విన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ నిన్న దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అర్ధశతకం సాధించిన విషయం తెలిసిందే.  టీమ్‌ఇండియా తరఫున ఆడిన సందర్భాల్లో  సాధారణంగా అశ్విన్‌ లోయర్‌  ఆర్డర్‌లో వచ్చి విలువైన పరుగులను సాధించేవాడు. అయితే ప్రస్తుత టీ20 లీగ్‌లో మాత్రం అడపాదడపా ఓపెనర్‌, వన్‌డౌన్‌ స్థానాల్లో వస్తూ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. సీజన్‌ ప్రారంభానికి ముందే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టానని, ఎంతో శ్రమించానని అశ్విన్‌ వెల్లడించాడు. ‘‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావడానికి ఎలాంటి లైసెన్స్‌ ఇవ్వలేదు. సీజన్‌ ప్రారంభానికి ముందే నన్నొక బ్యాటర్‌గా వినియోగించుకుంటామని యాజమాన్యం చెప్పింది. అందుకోసం నేను ఓపెనర్‌గా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా ఆడాం. బ్యాటింగ్‌పై చేసిన కృషి మైదానంలో కనిపించడం ఆనందంగా ఉంది’’ అని అశ్విన్‌ వివరించాడు. 

టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఐదు సెంచరీలను కూడా నమోదు చేశాడు. ఇప్పటి వరకు 86 టెస్టుల్లో 2,931 పరుగులు చేశాడు. మరోవైపు వన్డేల్లోనూ 113 మ్యాచుల్లో 707 పరుగులు చేశాడు. యావరేజీ (16. 4) తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా లోయర్‌ఆర్డర్‌లో వచ్చి ఆడేవాడు. ‘‘టీ20 లీగ్‌ ప్రారంభానికి ముందు వరకు నేను బ్యాటింగ్‌లో మంచి రిథమ్‌తో ఉన్నా. అయితే బ్యాటింగ్‌పై కొంచెం వర్క్‌ చేశా. షాట్‌కు తగ్గట్టుగా నా శరీరాన్ని మలుచుకున్నా. నిన్న దిల్లీపై హాఫ్ సెంచరీ కొట్టడం ఆనందంగా ఉన్నా విజయం సాధించలేకపోవడం బాధగా ఉంది.  టోర్నీ ముగిసేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి నాకౌట్‌కు వెళ్తాం’’ అని అశ్విన్‌ తెలిపాడు. 

ప్రస్తుతం రాజస్థాన్‌ 12 మ్యాచులకుగాను ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. అయితే మిగిలిన రెండింట్లో గెలిస్తే మాత్రం ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లను ఓడినా.. ఒకటి మ్యాచ్‌ ఓడి, మరొకటి గెలిస్తే మాత్రం ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్లే. రాజస్థాన్‌కు లఖ్‌నవూ (మే 15), చెన్నై (మే 20) జట్లతో మిగిలిన మ్యాచ్‌లు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts