Ashwin: వారిద్దరి సరసన చేరేంత గొప్ప ఓపెనర్‌ మురళీ విజయ్‌: అశ్విన్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్ (murali vijay)పై రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) ప్రశంసలు కురిపించాడు. దిగ్గజ ఓపెనర్లతో పోలుస్తూ అభినందించాడు.

Published : 16 Feb 2023 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు క్రికెట్‌లో వంద మ్యాచ్‌లు ఆడటం ప్రతి క్రికెటర్‌ కల. ఇప్పుడు ఛెతేశ్వర్‌ పుజారా (pujara) ఆ మార్క్‌ను తాకేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాదాపు రెండేళ్లపాటు ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడిన పుజారా.. కౌంటీ క్రికెట్‌ ఆడి మరీ ఫామ్‌ సాధించాడు. పుజారాను అభినందిస్తూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ (ashwin) మాట్లాడాడు. అలాగే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌పైనా (murali vijay) అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు.

‘‘చాలాఏళ్ల నుంచి పుజారా నాకు తెలుసు. అతడి ఆట నుంచే కాకుండా వ్యక్తిగతంగానూ ఎన్నో అంశాలను నేర్చుకుంటూ ఉంటా. అతడు చాలా మొండిగా ఉంటాడు. పుజారాతో ఏదైనా విషయంపై వాదించి గెలవడం చాలా కష్టం. ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించడు. తనదైన శైలిలో అద్భుతమైన వివరణ ఇస్తాడు. అలా ఉండటం నేను చాలా ఆనందిస్తా. ఇక మురళీ విజయ్‌ విషయానికొస్తే.. అతడు అద్భుతమైన ఆటగాడు. సునీల్ గావస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ మాదిరి అత్యుత్తమ ఓపెనర్‌. పుజారా వీరికి కాస్త విభిన్నంగా ఉంటాడు. టెస్టు క్రికెట్‌లో కొత్త బంతితో ఆడటం అత్యంత క్లిష్టం. ఇలాంటి గొప్ప బాధ్యతలను మురళీ విజయ్‌ సరళంగా నిర్వర్తించాడు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మురళీ విజయ్‌ తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐతో నా ప్రయాణం ముగిసింది. ఇక విదేశాల్లో అవకాశాలను వెతుక్కోవాలి. పోటీతత్వ క్రికెట్‌ను ఆడాలని అనుకొంటున్నా. ఇక్కడ (భారత్‌లో) ఎవరికైనా 30 ఏళ్లు దాటితే వారిని వయసు మళ్లినవారిగా చూస్తారు. అయితే నేనేమీ వివాదం చేయాలని చూడటం లేదు. మీడియా కూడా దీనిని విభిన్నంగా ప్రెజెంట్ చేస్తుంది. 30ల్లో ఉండి ఇక్కడకు వచ్చి కూర్చోవడం కూడా బాధగా ఉంటుంది. ఇప్పటికీ ఆడగలను. అదృష్టమో.. దురదృష్టమో.. అవకాశాలు మాత్రం చాలా తక్కువే. అందుకే బయట అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంది’’ అని విజయ్‌ తెలిపాడు. భారత్‌ తరఫున 61 టెస్టులు ఆడిన మురళీ విజయ్‌ 12 సెంచరీలు, 15 అర్ధశతకాలతో 3,982 పరుగులు సాధించాడు. ఇక 17 వన్డేలు, 9 టీ20ల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని