Cricket News: ఫ్రీ హిట్‌ × ఫ్రీ బాల్‌

క్రికెట్‌లో ఫ్రీహిట్ రద్దు చేయడానికి బదులుగా బౌలర్‌కు ఫ్రీబాల్‌ ఇవ్వాలని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ అన్నాడు. తన ప్రతిపాదన గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను కోరుతున్నాడు.

Published : 28 May 2021 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌లో ఫ్రీహిట్ రద్దు చేయడానికి బదులుగా బౌలర్‌కు ఫ్రీబాల్‌ ఇవ్వాలని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ అన్నాడు. తన ప్రతిపాదన గురించి ఆలోచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులను కోరుతున్నాడు. సంజయ్‌ మంజ్రేకర్‌ రాసిన ఓ కథనానికి అతడిలా స్పందించాడు.

‘హాయ్‌, నేను రాసిన కథనంలోని అంశాలపై మీ అభిప్రాయం చెప్పగలరు. క్రికెట్‌ వీక్షణానుభవం మెరుగుపరిచేందుకు నిబంధనల్లో ఎలాంటి మార్పులు తెస్తే బాగుంటుంది’ అని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఫ్రీహిట్‌’ అనేది పోవాలని, అది బౌలర్లకు జరిగిన అన్యాయమని చెబుతూ రాసిన కథనం దానికి జోడించాడు. దీనిపై యాష్ స్పందించాడు.

‘కమాన్‌ సంజయ్‌, ఫ్రీహిట్‌ అనేది గొప్ప మార్కెటింగ్‌ టూల్‌. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు. అందుకే నాన్‌స్ట్రైకర్‌ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్‌ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్‌ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి’ అని అశ్విన్‌ అన్నాడు. ‘గుర్తుంచుకోండి.. బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటాలి’ అని రెండోసారి ట్వీట్ చేశాడు. మరో మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తా ‘దీనికి నేను అంగీకరించను. ఫ్రీబాల్‌కు వికెట్‌ పడితే ఫర్వాలేదు. లేదంటే అది డాట్‌ బాలే (10 పరుగులు తీసేయకూడదు)’ అని యాష్‌కు బదులిచ్చాడు. ‘న్యాయమేంటో చర్చిద్దాం! సమన్యాయం ఉండాలన్న తపనను మాత్రం కొనసాగిద్దాం. మీ నుంచి వచ్చిన ఆ స్ఫూర్తిని ప్రేమిస్తాను’ అని యాష్‌ బదులిచ్చాడు.

బౌలర్లు నోబాల్‌ వేస్తే బ్యాట్స్‌మన్‌కు ఉపయోగకరమైన ఫ్రీహిట్‌ను కొన్నేళ్ల క్రితం ఐసీసీ ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా బ్యాట్స్‌మన్‌ అనుకూలమైన నిబంధన. చాలామంది క్రికెటర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బ్యాటు, బంతి మధ్య అంతరం పెరుగుతోందని, బ్యాట్స్‌మెన్‌ అనుకూల క్రీడగా క్రికెట్‌ మారుతోందని విమర్శిస్తున్నారు. అందువల్ల సమన్యాయం చేసేందుకు ఫ్రీబాల్‌ ప్రవేశపెట్టాలని యాష్ డిమాండ్‌ చేస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని