Ravichandran Ashwin: ఆ నొప్పి భరించలేక నేల మీద దొర్లాను: అశ్విన్

2020-2021 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గాయాల నొప్పి భరించలేక నేల మీద దొర్లినట్లు టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వెల్లడించాడు...

Published : 03 Jun 2022 09:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020-2021 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో గాయాల తీవ్రత భరించలేక నేల మీద దొర్లినట్లు టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వెల్లడించాడు. ఆ పర్యటనలో టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి ఆసీస్‌ను దాని సొంత గడ్డమీదే ఓడించడం భారత అభిమానులెవ్వరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో సీనియర్లు గాయాలపాలైనా యువకులే పోరాడి 2-1 తేడాతో చారిత్రక విజయం అందించారు. తాజాగా ఆ టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన కార్యక్రమంలో అశ్విన్‌ మాట్లాడుతూ సిడ్నీ టెస్టులో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించాడు.

‘సిడ్నీ టెస్టులో నేనూ, విహారి బ్యాటింగ్‌ చేస్తుండగా మా సమస్యలేమిటో అర్థం చేసుకున్నాం. అతడు తొడకండరాల గాయంతో ఇబ్బందిపడుతూ దూకుడుగా ఆడలేకపోయాడు. నేనేమో ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోలేకపోయాను. అలాంటప్పుడు విహారి వద్దకు వెళ్లి.. ఇద్దరం కలిసి స్ట్రైక్‌ రొటేట్‌ చేద్దామని చెప్పాను. తర్వాత అతడు ఫాస్ట్‌ బౌలర్లను ఆడితే.. నేను స్పిన్నర్లను ఎదుర్కొన్నాను. దాంతో కొన్ని ఓవర్ల పాటు మేం మెల్లిగా నెట్టుకొచ్చాం. మేమిద్దరం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నిదానంగా ఇన్నింగ్స్‌ కొనసాగించాం. అయితే, ఆ టెస్టులో నేను కూడా గాయాల నొప్పులతో ఇబ్బందిపడ్డాను. ఒక దశలో బాధ భరించలేక నేలపై పడుకొని దొర్లాను. ఆ సమయంలో నేను పైకి లేవడానికి నా భార్య, పిల్లలు సాయం చేశారు. అప్పుడు ఫిజియో వచ్చి చూశారు. పెయిన్‌ కిల్లర్లతోనే మైదానంలోకి వెళ్లి నా అత్యుత్తమ ప్రదర్శన చేశాను’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

కాగా, ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ (39 నాటౌట్‌; 128 బంతుల్లో 7x4), హనుమ విహారి (23; 161 బంతుల్లో 4x4) పట్టుదలతో ఆడారు. వారిద్దరి వల్లే ఆ టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి నుంచి బయటపడింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటవ్వగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ముగిసింది. తర్వాత ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 312/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి భారత్‌ ముందు 406 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 272/5తో ఓటమిపాలయ్యేలా కనిపించింది. ఆ సమయంలోనే అశ్విన్‌, విహారి గాయాలతో ఇబ్బంది పడుతున్నా.. ఐదో రోజు రెండున్నర సెషన్లు బ్యాటింగ్‌ చేసి ఆసీస్‌ విజయాన్ని అడ్డుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని