Ashwin-Warne : అశ్విన్‌ మాటల్లో.. ద్రవిడ్‌-షేన్‌వార్న్‌ ‘భుజ బలం’ వెనుక స్టోరీ!

దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ హఠాన్మరణం టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను...

Published : 10 Mar 2022 01:55 IST

యూట్యూబ్‌లో వివరించిన రవిచంద్రన్‌ అశ్విన్‌

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ హఠాన్మరణం టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తెలిపాడు. ఈ నెల 4న థాయ్‌లాండ్‌లో గుండెపోటుకు గురై షేన్‌వార్న్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థులు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో రాజస్థాన్‌ రాయల్స్ తరఫున రాహుల్‌ ద్రవిడ్‌, వార్న్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నారు. దీంతో షేన్‌వార్న్‌ హఠాన్మరణంపై రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడినట్లు అశ్విన్‌ పేర్కొన్నాడు. 

క్రికెట్‌ సహా ఇతర అంశాలకు సంబంధించి అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘‘షేన్‌వార్న్‌ మరణంతో తీవ్ర విచారంలోకి వెళ్లిన రాహుల్‌తో నేను మాట్లాడాను. వారిద్దరూ చాలా కాలంగా ఆడిన అనుభవజ్ఞులు. అంతర్జాతీయ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీయడం మమూలు విషయం కాదు. ఒక స్పిన్నర్‌కు భుజం, శరీరంలోని ఛాతీభాగం చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే బంతిని స్పిన్‌ చేయడానికి విభిన్న రకాలుగా రొటేషన్‌ చేయాల్సి ఉంటుంది. స్పిన్నర్‌గా నైపుణ్యం సాధించాలంటే నెట్స్‌లో నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. లెగ్‌ స్పిన్నర్‌ అయితే బలమైన భుజాలు ఉంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.

‘‘నీ భుజాలను బలంగా ఉంచుకోవడానికి ఏం చేస్తావని వార్న్‌ను ద్రవిడ్‌ అడిగితే దానికి వార్న్‌ స్పెషల్‌ స్టోరీ చెప్పాడంట. ఆసీస్‌ రూల్స్‌తో ఉండే ఫుట్‌బాల్‌ ఆడటం వల్లే పుష్టిగా ఉన్నాయని వివరించాడట. అది రగ్బీ ఆటలానే ఉంటుంది. అంతేకాకుండా వార్న్‌కు చిన్నప్పుడే రెండు కాళ్లు విరిగాయి. ఎత్తు నుంచి ఓ పిల్లాడు వార్న్‌ వీపు మీదకు దూకడంతో ఈ ఘటన జరిగింది. దీంతో నాలుగు వారాలపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లు నడవడానికి ఇబ్బందిగా అనిపించడంతో చేతుల సాయంతోనే ముందుకు వెళ్లాడు. దీనివల్ల కూడానూ షేన్‌వార్న్‌ భుజాలు మరింత బలంగా తయారయ్యాయి ’’ అని అశ్విన్‌ వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని