IND vs AUS:రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలాముఖ్యం: ఆకాశ్‌ చోప్రా

మరికొన్ని రోజుల్లో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉండటం టీమ్‌ఇండియా (Team India)కు చాలా ముఖ్యమని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Published : 02 Feb 2023 19:29 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) ప్రారంభంకానుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి రిషబ్ పంత్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. సిరీస్‌కు ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్ వెన్ను గాయానికి  జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్ సాధించకపోతే తొలి టెస్టుకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఫిట్‌గా ఉండి అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మోకాలి గాయానికి  శస్త్రచికిత్స చేసుకుని ఐదు నెలలపాటు ఆటకు దూరమైన జడేజా.. ఇటీవల కోలుకుని రంజీ ట్రోఫీలో ఆడాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు నాగ్‌పూర్‌లో నిర్వహించే ట్రైనింగ్ సెషన్స్‌లో అతడు పాల్గొనేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ ఫిబ్రవరి 1న అనుమతినిచ్చింది. 

‘రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నాడు. అతడు ఇటీవల ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడి చాలా వికెట్లు పడగొట్టాడు. జడేజా ఇప్పటికే భారత జట్టు శిబిరంలో భాగమయ్యాడు. జడేజా ఫిట్‌గా ఉండటం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం. ఎందుకంటే రిషబ్ పంత్ (Rishabh Pant) అందుబాటులో లేడు. శ్రేయస్ అయ్యర్ ఆడేది కూడా అనుమానంగానే ఉంది. శ్రేయస్‌ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. దాని నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. అయ్యర్‌ అందుబాటులో లేకుంటే సూర్యకుమార్‌కు తుదిజట్టులో అవకాశం దక్కొచ్చు. హనుమ విహారి కూడా జట్టులో లేడు. జడ్డూ కూడా అందుబాటులో లేకపోతే బ్యాటింగ్ విభాగం చాలా బలహీనంగా మారుతుంది. కాబట్టి, జడేజా ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం’  అని ఆకాశ్ చోప్రా వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని