Team India: ‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా

యూఎస్ఏ ఎడిషన్ నుంచి విండీస్‌కు భారత మ్యాచులు తరలివెళ్లనున్నాయి. ప్రపంచ కప్ సూపర్-8 మ్యాచులను టీమ్‌ఇండియా ఇక్కడే ఆడనుంది.

Published : 18 Jun 2024 11:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) టీమ్‌ఇండియా సూపర్‌-8 మ్యాచ్‌లను విండీస్‌ వేదికగా ఆడనుంది. ఇప్పటివరకు యూఎస్‌ఏలోని డ్రాప్‌-ఇన్‌ పిచ్‌లపై స్వల్ప స్కోర్లకే పరిమితమైన మ్యాచుల్లో తలపడింది. ఇకనుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్‌లో అడుగుపెట్టనుంది. ఇక్కడ స్పిన్నర్లకూ పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా అంగీకరించారు. మిడిల్‌, డెత్ ఓవర్లలో స్పిన్‌ ఎటాక్‌తో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. 

‘‘ఎప్పుడు విండీస్‌లో ఆడినా.. అక్కడి పిచ్‌లు చాలా మందకొడిగా ఉండి పొడిబారినట్లు ఉంటాయి. మ్యాచులన్నీ ఉదయం కావడంతో స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుంది. భారత్‌లో మాదిరిగానే అక్కడి పిచ్‌లు స్పిన్‌ ఫ్రెండ్లీ. మిడిల్‌ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. స్పిన్నర్లతో డెత్‌ ఓవర్లలోనూ బౌలింగ్‌ చేయించడం చూసే అవకాశం లేకపోలేదు’’ అని జడేజా తెలిపాడు. 

నలుగురితో...: కుల్‌దీప్‌

‘‘విండీస్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని తెలుసు. తుది జట్టులో తప్పకుండా నలుగురు స్పిన్నర్లు ఉంటారని భావిస్తున్నా. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు లైన్‌ అండ్ లెంగ్త్‌ అత్యంత కీలకం. ఏమాత్రం గతి తప్పినా బ్యాటర్ల నుంచి పనిష్‌మెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతేడాది మేం విండీస్‌తో టీ20 సిరీస్‌ ఆడిన అనుభవం తప్పకుండా కలిసొస్తుంది. అప్పటికీ.. ఇప్పటికీ పిచ్‌ల్లో పెద్దగా తేడా లేదని అనుకుంటున్నా’’ అని వెల్లడించాడు. జూన్ 20న అఫ్గాన్‌, జూన్ 22న బంగ్లాదేశ్‌, జూన్‌ 22న ఆసీస్‌తో భారత్ సూపర్-8 మ్యాచుల్లో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని