Ravindra Jadeja: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. 

Updated : 30 Jun 2024 21:00 IST

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ టీ20లకు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వీడ్కోలు పలికాడు. భారత్ తాజాగా సాధించిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’  అని జడేజా తన ఇన్‌స్టా ఖాతాలో వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోని పోస్టు చేశాడు. 

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్

జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘డియర్‌ జడేజా మీరు ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించారు. మీ స్టైలిష్ స్ట్రోక్ ప్లే, స్పిన్, మెరుపు వేగంతో చేసే ఫీల్డింగ్‌కు క్రికెట్‌ ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు ధన్యవాదాలు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విటర్)లో పోస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని