Ravindra Jadeja: చివరి 5 ఓవర్లలో మా ప్రణాళికలు అమలు చేయలేదు: జడేజా

ఈ సీజన్‌లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. గతరాత్రి గుజరాత్‌తో తలపడిన పోరులోనూ ఓటమిపాలైంది. దీంతో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గేమ్స్‌ కోల్పోయింది...

Updated : 18 Apr 2022 12:35 IST

(Photo: Ravindra Jadeja Instagram)

ముంబయి: ఈ సీజన్‌లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. గతరాత్రి గుజరాత్‌తో తలపడిన పోరులోనూ ఆ జట్టు నిరాశ పరిచింది. దీంతో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిని కోల్పోయింది. ప్లేఆఫ్స్‌ రేసులో చోటు సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన జడేజా తాము ఈ గేమ్‌లో బాగా ఆడినా డేవిడ్‌ మిల్లర్‌ ఆటను దూరం చేశాడని చెప్పాడు.

‘ఈ మ్యాచ్‌ను మేం అద్భుతంగా ఆరంభించాం. మా బౌలింగ్‌లో తొలి ఆరు ఓవర్లు గొప్పగా బంతులేశాం. కానీ, గుజరాత్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌కే ఆ క్రెడిట్‌ అంతా దక్కుతుంది. అతడు మంచి షాట్లు ఆడాడు. తొలుత మేం బ్యాటింగ్‌ చేసేటప్పుడు వికెట్‌ స్పందించిన తీరు బాగోలేదు. బంతి అంత వేగంగా రాలేదు. అలాంటప్పుడు మేం సాధించిన 169 పరుగులు గుజరాత్‌కు సరిపోతాయని అనుకున్నాం. కానీ, చివరి ఐదు ఓవర్లలో మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం’ అని జడేజా వివరించాడు. అలాగే ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లలోనే 58 పరుగులిచ్చిన తమ బౌలర్‌ క్రిస్‌జోర్డాన్‌పై స్పందిస్తూ.. అతడికి ఉన్న అనుభవంతోనే ఫైనల్‌ ఓవర్‌లో బౌలింగ్‌ ఇచ్చానని చెప్పాడు. జోర్డాన్‌ ఓవర్‌కు 4-5 యార్కర్లు వేయగలడని.. కానీ, ఈ మ్యాచ్‌లో అది కుదరలేదని వెల్లడించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 169/5 స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (73; 48 బంతుల్లో 5x4, 5x6) ఈ సీజన్‌లో తొలిసారి మెరిశాడు. ఛేదనలో గుజరాత్‌ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడగా.. ఐదో బ్యాటర్‌గా వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (94నాటౌట్‌; 51 బంతుల్లో 8x4, 6x6) చివరి వరకూ క్రీజులో నిల్చొని మ్యాచ్‌ను గెలిపించాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌ (40; 21 బంతుల్లో 2x4, 3x6) సైతం ధనాధన్‌ బ్యాటింగ్‌ చేశాడు. అయితే, 17 ఓవర్ల వరకు ఆధిపత్యంలో కనిపించిన చెన్నైని జోర్డాన్‌ ముంచేశాడు. అతడు వేసిన 18వ ఓవర్‌లో రషీద్‌ ఖాన్‌ మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో మొత్తం 25 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను గుజరాత్‌వైపు మళ్లించాడు. తర్వాత రషీద్‌ ఔటైనా మిల్లర్‌ ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు సాధించి పని పూర్తి చేశాడు. దీంతో చెన్నై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని