Ravi Shastri: అప్పుడు కలత చెందా

టీమ్‌ఇండియా కష్ట కాలంలో ఉండగా రెండుసార్లు జట్టుకు సేవలు అందించిన తనను 2016లో డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడంతో కలత చెందానని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఆ సమయంలో తనకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు భావించారని అతను ఆరోపించాడు. అయితే అప్పుడు వద్దనుకున్న వాళ్లే..

Updated : 11 Dec 2021 08:41 IST

నాకు ఏ పని లేకుండా చేయాలని చూశారు
రాయుడిని ఎంపిక  చేయకపోవడం తప్పే

ముంబయి: టీమ్‌ఇండియా కష్ట కాలంలో ఉండగా రెండుసార్లు జట్టుకు సేవలు అందించిన తనను 2016లో డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించడంతో కలత చెందానని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ఆ సమయంలో తనకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు భావించారని అతను ఆరోపించాడు. అయితే అప్పుడు వద్దనుకున్న వాళ్లే.. తిరిగి కోచ్‌గా నియమించడంతో తాను నైతిక విజయం సాధించానని రవిశాస్త్రి అన్నాడు. ఇటీవలే కోచ్‌గా దిగిపోయిన రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో టీమ్‌ఇండియాలో తన కోచింగ్‌ అనుభవాలపై మాట్లాడాడు. ‘‘2007లో జట్టు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నపుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తాత్కాలికంగా నన్ను బాధ్యతలు చేపట్టమన్నాడు. ఆ తర్వాత 2014 జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్నపుడు అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అవే బాధ్యతలు అప్పగించాడు. ఆ కఠిన సమయాల్లో నేను ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నించాను. కానీ 2016లో ఉన్నట్లుండి నేను జట్టుకు అవసరం లేదు పొమ్మన్నారు. ఆ సమయంలో నాకు ఏ పనీ లేకుండా చేయాలని కొందరు ప్రయత్నించారు. వాళ్ల పేర్లు చెప్పను. అయితే నేను తప్పుకున్న తొమ్మిది నెలలకే జట్టులో పెద్ద సమస్య మొదలైంది. అంత బాగా ఉన్న జట్టులో ఉన్నట్లుండి ఏం జరిగింది అనుకున్నా. ఈ స్థితిలో మళ్లీ నన్నే కోచ్‌గా పిలిచారు. అంతకుముందు నన్ను దూరం పెట్టాలని చూసిన వారికి ఇది చెంపపెట్టులా మారింది’’ అని రవిశాస్త్రి అన్నాడు. భారత జట్టు విదేశాల్లో ధైర్యంగా ఆడటం, అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగడం, నిలకడగా విజయాలు సాధించడం కోచ్‌గా తన హయాంలో వచ్చిన మార్పులే అని చెప్పాడు. బుమ్రాను టెస్టు జట్టులోకి తీసుకోవాలన్న నిర్ణయం తనదేనన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌నకు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పేనని రవిశాస్త్రి తెలిపాడు. రాయుడు లేదా శ్రేయస్‌ జట్టులో ఉండాల్సిందన్నాడు. ధోని, పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ల రూపంలో ముగ్గురు వికెట్‌ కీపర్లు జట్టులో ఉండటంలో అర్థం లేదని.. అయితే సెలక్టర్ల నిర్ణయంలో తాను జోక్యం చేసుకోలేదని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని