ZIM vs IND: బ్యాటర్ల మధ్య తీవ్ర పోటీ.. టీమ్‌ఇండియాకు మంచిదే: ఆండీ ఫ్లవర్‌

అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఇద్దరు క్రికెటర్లలో ఎవరిని ఆడించాలనే సంకట స్థితి ఇప్పుడు టీమ్‌ఇండియాలో ఉంది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

Updated : 10 Jul 2024 11:48 IST

ఇంటర్నెట్ డెస్క్:  కేవలం 47 బంతుల్లోనే సెంచరీ కొట్టి మిగతా బ్యాటర్లకు అభిషేక్ శర్మ (Abhishek Sharma) సవాల్ విసిరాడు. జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయి నిరాశ పరిచినా.. కీలకమైన రెండో టీ20లో మాత్రం శతకంతో చెలరేగిపోయాడు. అయితే, ఇప్పుడు మూడో టీ20లో భారత మేనేజ్‌మెంట్‌కు ఓ సమస్య ఎదురైంది. తొలి రెండు మ్యాచులకు అందుబాటులో లేని యశస్వి జైస్వాల్‌ జింబాబ్వేలో (ZIM vs IND) అడుగుపెట్టాడు. మూడో టీ20లో అతడు ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో సెంచరీ హీరో అభిషేక్‌ను ఎక్కడ ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వీరిద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే కావడం గమనార్హం. మరోవైపు కెప్టెన్ గిల్ మాత్రం తానే ఓపెనర్‌గా ఉండాలని అనుకుంటున్నట్లు సిరీస్‌కు ముందే చెప్పాడు. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందో అనే విషయంపై జింబాబ్వే మాజీ స్టార్‌ క్రికెటర్, ఆర్సీబీ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ స్పందించాడు.

‘‘ఐదు టీ20ల సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు యశస్వి (Yashasvi Jaiswal) వచ్చేశాడు. ఓపెనింగ్‌ స్థానంపై తీవ్ర పోటీ ఉంది. భారత సెలక్టర్లకు ఇది కఠిన సవాలే. అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇలా ఉండటం మాత్రం టీమ్ఇండియా క్రికెట్‌కు భారీ మేలు జరుగుతుంది. మరిన్ని ఆప్షన్లు ఉండటం వల్ల నాణ్యమైన క్రికెట్‌ను చూసే అవకాశం దక్కుతుంది. అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంది. ఐపీఎల్‌లో అతడి ఆటను చూశాం. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం అద్భుతం. యువ క్రికెటర్‌కు ఇలాంటి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌పై నమ్మకం పెంచుతుంది. మున్ముందు మరిన్ని మంచి ఆటతీరును చూస్తామనడంలో సందేహం లేదు’’ అని ఆండీ ఫ్లవర్‌ తెలిపాడు. 

నేనెప్పుడూ కోహ్లీతో పోల్చుకోను: రుతురాజ్‌

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) వన్‌డౌన్‌లో వస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఇదే స్థానంలో ఆడి ఇటీవలే పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ పాత్రను పోషించేందుకు రుతురాజ్‌ సిద్ధమవుతున్నాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వాటిపై దృష్టిపెట్టనని.. అసలు కోహ్లీతో పోల్చుకోవడం సరైంది కాదని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. ‘‘ఇది చాలా పెద్ద విషయం. అసలు దానిగురించి ఆలోచించడమే సరైంది కాదు. కోహ్లీ పోలిక.. అతడి స్థానాన్ని పూరించడమంటేనే అత్యంత కఠినమైన సవాల్‌. ఐపీఎల్‌లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్లేస్‌ను.. ఇక్కడ విరాట్‌ను భర్తీ చేయడం చాలా కష్టం’’ అని రుతురాజ్‌ స్పష్టం చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని