MIw vs RCBw: ఆర్‌సీబీ ఆలౌట్‌... ముంబయి లక్ష్యం 156

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 06 Mar 2023 21:30 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో మరో ఆసక్తికర పోరు సాగుతోంది. ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ ఇన్నింగ్స్‌ పూర్తయింది. బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయ్యింది.  తొలుత టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ.. ప్రారంభంలో దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23; 5×4) సోఫియే డివైన్‌ (16; 4×2) చెలరేగిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ జోడీని సాయిక్‌ ఇషాక్‌ విడగొట్టింది. సాయిక్‌ వేసిన 4.2వ బంతికి భారీ షాట్‌ ఆడబోయిన డివైన్‌... అమన్‌జ్యోత్‌ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కసత్‌ (0) పరుగులేమీ చేయకుండానే ఔటయ్యింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే హేలీ మ్యాథ్యూస్‌ బౌలింగ్‌లో వోంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి మంధాన కూడా పెవిలియన్‌ బాటపట్టింది.

స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు వేగం ఒక్కసారిగా మందగించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పెర్రీ (13), హీథర్‌ నైట్‌ (0) కూడా పెద్దగా రాణించలేదు. అయితే, రిచా ఘోష్‌ (28), ఆహుజా (22), శ్రేయంకా పాటిల్‌ (23), మేఘనా స్కౌట్‌ (20)  దూకుడుగా ఆడటంతో  ఆర్‌సీబీ చెప్పుకోదగ్గ స్కోరే చేసింది. కానీ, వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైందనే చెప్పాలి. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌ 3 వికెట్లు తీయగా.. సాయిక్‌ ఇషాక్‌, అమేలియా కేర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్‌,బంట్ర్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని