T20 League Auction: ఆ స్టార్‌ పేసర్‌కి బెంగళూరు ప్రత్యామ్నాయం చూసుకోవాలి: ఇర్ఫాన్‌

భారత టీ20 లీగ్‌ (T20 League) మినీ వేలం (Auction) డిసెంబరు 23న కొచ్చిలో జరగనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు (Bangalore) జట్టుకు ఇర్ఫాన్‌ (Irfan Pathan) కొన్ని సూచనలు చేశాడు.

Updated : 24 Mar 2023 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత టీ 20 లీగ్‌లో గతేడాది బెంగుళూరు అదిరిపోయే ప్రదర్శన చేసింది. రెండో క్వాలిఫయర్‌ వరకు వెళ్లి.. కప్‌ ఆశలు రేకెత్తించింది. దీనికి ముఖ్య కారకుల్లో జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒకరు. సీజన్‌లో 20 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వచ్చే ఏడాది టీ20 లీగ్‌లో హేజిల్‌వుడ్‌ ఆడతాడా? ఆడితే ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కారణం వచ్చే ఏడాది యాషెస్‌ సిరీస్‌ జరగనుండటమే. ఈ నేపథ్యంంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ బెంగళూరుకు కీలక సూచన చేశాడు.

భారత టీ20 లీగ్‌ మినీ వేలం డిసెంబరు 23న కొచ్చిలో జరగనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు ఇర్ఫాన్‌ కొన్ని సూచనలు చేశాడు. బెంగళూరు జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో మరో మేటి పేసర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది.జోష్‌ హేజిల్‌వుడ్‌లా జట్టుకు ఉపయోగపడే పేసర్‌ను బెంగళూరు ఈసారి వేలంలో పట్టుకోవాల్సిందే అని పఠాన్ అన్నాడు. ‘‘ఇది యాషెస్‌ సంవత్సరం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు చాలా ముఖ్యమైన సంవత్సరం. అందువల్ల వాళ్లు పూర్తిగా ఆటపై దృష్టి పెడతారు. జూన్‌లో ఈ టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో.. జట్టు సభ్యులకు పని ఒత్తిడి ఉండకుండా రెస్ట్‌ తీసుకునేలా యాజమాన్యం సూచనలు చేసే అవకాశం ఉంది. దీంతో హేజిల్‌వుడ్‌ ఎంతవరకు ఈ టీ20 లీగ్‌లో బెంగళూరుకు అందుబాటులో ఉంటాడో తెలియదు. ఒకవేళ అతను ఆడకపోతే.. అతని స్థానాన్ని బ్యాకప్‌ చేసేలా ఓ మంచి ఫాస్ట్‌ బౌలర్‌ని సిద్ధం చేసుకోవాలి’’ అని పఠాన్‌ సూచించాడు. 

‘‘గత సంవత్సరం.. పవర్‌ ప్లేలో యంగ్ ప్లేయర్‌ ఆకాశ్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా బౌలింగ్‌ చేస్తాడు. అయితే కొత్త బంతితో బౌలింగ్‌ చేయగల నాణ్యమైన ఫాస్ట్‌బౌలర్‌ను బెంగుళూరు తీసుకుంటే.. ఆ జట్టు మరింత మెరుగ్గా కనిపిస్తుంది’’ అని తన అభిప్రాయం తెలిపాడు. ఇక బ్యాటింగ్‌ గురించి చెబుతూ.. ‘‘బెంగుళూరు జట్టులో అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. విరాట్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, వనిందు హసరంగ, షాబాజ్‌ అహ్మద్‌, మహిపాల్‌ లామ్రర్‌ వంటి గొప్ప ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. వీళ్లు నలుగురూ బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండిట్లోనూ రాణించగలరు’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని