Glenn Maxwell : మాక్స్‌వెల్ వెడ్డింగ్‌ కార్డు వైరల్‌.!

కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వివాహం వాయిదా వేస్తూ వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌.. త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రస్తుతం అతడి వెడ్డింగ్‌ కార్డు సామాజిక

Published : 15 Feb 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వివాహం వాయిదా వేస్తూ వచ్చిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌.. త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రస్తుతం అతడి వెడ్డింగ్‌ కార్డు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. 2020 మార్చిలో మాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, వారి వెడ్డింగ్ కార్డుని నటి కస్తూరి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. వినీ రామన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తమిళ సాంప్రదాయంలో ముద్రించిన అందమైన ముహూర్త ప్రతికను బట్టి చూస్తే.. ఈ జంట ఇటు తమిళ, అటు క్రిస్టియన్‌ సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కంగ్రాట్యులేషన్స్’ అని ఆమె రాసుకొచ్చారు. తమిళ సంప్రదాయంలో ముద్రించిన వీరి వెడ్డింగ్‌ కార్డుని చూసి నెటిజన్లు సంతోషం వ్య్తక్తం చేస్తూ.. ఆ పోస్టును పంచుకుంటున్నారు. దీంతో అది వైరల్‌గా మారింది.

ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా త్వరలో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మాక్స్‌వెల్ దూరమయ్యాడు. పెళ్లి చేసుకునేందుకే అతడు ఈ పర్యటనకు దూరమైనట్లు వార్తలొస్తున్నాయి. తమిళనాడుకి చెందిన వినీ రామన్‌ ఆస్ట్రేలియాలో మెడిసిన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. 2013లో ఓ ఈవెంట్‌లో వినీ రామన్‌ని చూసిన మాక్స్‌వెల్‌ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుంచి వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమైన సమయంలో వినీ రామన్‌ అండగా నిలిచిందని.. మానసిక ఒత్తిడి నుంచి కోలుకుని.. తిరిగి ఫామ్‌ అందుకోవడంలో ఆమె పాత్ర కీలకమని మాక్స్‌వెల్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మాక్స్‌వెల్‌.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు