Hardik Pandya: హార్దిక్‌ ‘హిట్టింగ్‌’ మ్యానే కాదు ‘హిడెన్‌’ జెమ్‌ కూడా..!

హార్దిక్‌ పాండ్య 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా కొంత కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు...

Updated : 30 May 2022 11:10 IST

సమష్టిగా రాణిస్తే అద్భుతాలు చేయొచ్చు..

హార్దిక్‌ పాండ్య 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా కొంత కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలో కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా గుజరాత్‌ కెప్టెన్‌గా అడుగుపెట్టాడు. తొలి సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపి తనలోని హిడెన్‌ జెమ్‌ని ప్రపంచానికి చూపాడు.

ముక్కుసూటి వ్యక్తిత్వం వదిలి..

ఎదుటివారు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్నది బల్లగుద్దినట్టు చెప్పే తత్వం హార్దిక్‌ది. అది అతడికి చిన్ననాటి నుంచే వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడి.. యాటిట్యూడ్‌ ప్రదర్శించి పలుసార్లు విమర్శలకూ గురయ్యాడు. ఆ లక్షణం కారణంగానే ఓసారి రాష్ట్రస్థాయి వయస్సు ప్రమాణిక పోటీల్లో చోటు కోల్పోయాడు. తన వ్యక్తిత్వంతోనే భారత జట్టులోనూ ఒక దశలో సమస్యలు ఎదుర్కొన్నాడు. తర్వాత తన వ్యక్తిత్వం మార్చుకొని ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాడు. అదే ఈ మెగా టోర్నీలో అతడికి బాగా కలిసొచ్చింది. సహజంగా మైదానంలో ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే పాండ్య.. ఈ సీజన్‌లో పూర్తి భిన్నంగా కనిపించాడు. ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే దగ్గరికెళ్లి మాట్లాడటం, నిరంతరం బౌలర్లకు అందుబాటులో ఉంటూ విలువైన సూచనలు చేయడం గుజరాత్‌కు కలిసొచ్చింది.

సమయస్ఫూర్తితో మెలిగి..

క్రికెట్‌లో గొప్ప సారథులుగా పేరుతెచ్చుకున్నవాళ్లంతా సమయస్ఫూర్తితో మెలిగిన వారే. కపిల్‌దేవ్‌ నుంచి ధోనీ దాకా మైదానంలో చురుగ్గా ఉంటూ అప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకున్నవారే. అందుకే వారు విశ్వవిజేతలుగా ఎదిగారు. పాండ్య సైతం ఈ టోర్నీలో చేసింది అదే. దానికి ఉదాహరణే గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌. లీగ్‌ టోర్నీలోనూ పాండ్య తన నాయకత్వంతో ఆకట్టుకున్నా.. తుదిపోరులో అసలైన నాయకుడి లక్షణాలను ప్రదర్శించాడు. రాజస్థాన్‌ ఎంతో నమ్మకంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంటే దాన్ని 130 పరుగులకే కట్టడి చేయడం మామూలు విషయం కాదు. అక్కడే పాండ్య సగం మ్యాచ్‌ గెలిచాడు. రాజస్థాన్‌ జట్టులో యశస్వి జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మెయర్‌ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోర్లకే కట్టడి చేశాడు. అక్కడ పాండ్య ఉపయోగించిన ట్రిక్‌.. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించి కీలక సమయంలో వికెట్లు రాబట్టాడు. 

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని..

ఎక్కడైనా సారథి ముందుండి నడిపిస్తే ఆ జట్టుకు లభించే ఆత్మవిశ్వాసమే వేరు. ఈ సీజన్‌లో పాండ్య చేసింది కూడా అదే. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు బౌలర్‌గా గుజరాత్‌కు అవసరమైన సేవలు అందించాడు. ఈ సీజన్‌లో అతడు తన బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు తెచ్చుకొని 15 మ్యాచ్‌ల్లో 487 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలవడమే కాకుండా గుజరాత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గానూ మెరిశాడు. అందులో నాలుగు అర్ధ శతకాలతో పాటు 44.27 సగటు, 131.26 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. అలాగే కీలకమైన ఫైనల్లో పాండ్య మేటి ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నాడు. తొలుత బంతితో రాజస్థాన్‌ జట్టులోని కీలక ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మెయర్‌లను ఔట్‌ చేశాడు. దీంతో 4 ఓవర్లలలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ పాండ్య (34; 30 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు. అలా కేవలం ఫైనల్లోనే కాకుండా టోర్నీలో తనదైన ముద్ర వేశాడు.

ఆటగాళ్లపై నమ్మకం ఉంచి..

ఈ సీజన్‌లో గుజరాత్‌ అంత సమష్టిగా రాణించిన జట్టు ఏదీ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏమాత్రం అంచనాల్లేని జట్టుగా అడుగుపెట్టి.. ఇద్దరు, ముగ్గురు స్టార్లతోనే బరిలోకి దిగి మేటి జట్లను ఓడించి సంచలన విజయాలు సాధించాడు. అందుకు ప్రధాన కారణం తన ఆటగాళ్లపై పాండ్య పెట్టుకున్న నమ్మకమే. అతడు సమయోచితంగా నాయకత్వం చేస్తూనే తనపై పనిభారం పెరిగినప్పుడు పలు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌కు దూరమయ్యాడు. అదే సమయంలో యశ్‌ దయాల్‌, సాయి కిషోర్‌ వంటి యువకులకు అవకాశాలు కల్పించాడు. వారు సరైన సందర్భాల్లో.. సరైన రీతిలో రాణించారు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఇతర ఆటగాళ్లు కూడా మెరిశారు. అందుకు నిదర్శనమే రాహుల్‌ తెవాతియా, డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమి, లాకీ ఫెర్గూసన్‌. వీళ్లంతా ఒకరు కాకపోయినా మరొకరు అన్నట్లు ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడారు. దీంతో పాండ్య తన ఆటగాళ్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు.

అదే గుజరాత్‌ సక్సెస్‌ మంత్ర..

‘సరైన వ్యక్తులతో మంచి జట్టును రూపొందించి బాధ్యతాయుతంగా ఆడితే ప్రపంచంలో ఏ జట్టుకైనా ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. టీ20 క్రికెట్‌ అనేది బ్యాట్స్‌మన్‌ గేమ్‌. కానీ, బౌలర్లు కూడా మ్యాచ్‌లు గెలిపిస్తారు. అలా బౌలింగ్‌తో మేం కూడా పలు విజయాలు సాధించాం. అలాగే మేం ఓడిపోయిన సందర్భాల్లో ఎక్కడ వెనుకబడిపోయామనే విషయాలు తెలుసుకొని వాటి గురించి మాట్లాడుకొని తప్పులను సరిదిద్దుకోవాలని ప్రయత్నించాం. అందుకు తగ్గట్టే మా ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ మెరుగైన ప్రదర్శన చేశారు. అలాగే ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే మేం చరిత్ర సృష్టించాలని అనుకున్నాం. భవిష్యత్‌లో మా గురించి గొప్పగా చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆడిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ కప్పు ఎగరేసుకుపోయిందని గొప్పగా చెప్పుకొంటారు’ అని పాండ్య తుది పోరు తర్వాత మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి అతడెంత సానుకూల ఆలోచనా ధోరణితో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా తొలి సీజన్‌లోనే గుజరాత్‌కు టైటిల్‌ అందించిన పాండ్య హిట్టింగ్‌ మ్యాన్‌ కాదు హిడెన్‌ జెమ్‌ అని నిరూపించుకున్నాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని