IND vs NZ: లఖ్‌నవూ ‘షాకింగ్‌’ పిచ్‌.. క్యురేటర్‌పై వేటు..!

భారత్ - న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్ల మధ్య రెండో టీ20 జరిగిన లఖ్‌నవూ (Lucknow Pitch) పిచ్‌పై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో ఆ క్యురేటర్‌పై వేటు వేసినట్లు సమాచారం.

Published : 31 Jan 2023 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థిని 99 పరుగులకే కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. ఛేదనలో తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలంగా మారిన లఖ్‌నవూ పిచ్‌పై బంతి విపరీతంగా టర్నింగ్‌ అయింది. టీ20 ఫార్మాట్‌కు ఇలాంటి పిచ్‌ సరైంది కాదనే వ్యాఖ్యలు వినిపించాయి. భారత కెప్టెన్ హార్దిక్‌ పాండ్య కూడా ‘లఖ్‌నవూ వికెట్ షాక్‌కు గురి చేసింది’ అని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో ఇలాంటి పిచ్‌ను తయారు చేసిన క్యురేటర్‌పై వేటు పడిందని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఉన్న క్యురేటర్‌ను తొలగించి.. అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన సంజీవ్‌ కుమార్‌ అగర్వాల్‌ను నియమించడం జరిగింది. ‘‘టీ20 మ్యాచ్‌కు ముందు వరకు ఇదే పిచ్‌ మీద దేశవాళీ మ్యాచ్‌లు చాలా జరిగాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం క్యురేటర్‌ కనీసం ఓ రెండు స్ట్రిప్‌లను వదిలి ఉంటే బాగుండేది. సర్ఫేస్‌ ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పిచ్‌ను తాజాగా సిద్ధం చేయడానికి తగినంత సమయం దొరకలేదు’’ అని పీటీఐతో ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వర్గాలు వెల్లడించాయి. సంజీవ్‌ కుమార్‌కు గతంలో బంగ్లాదేశ్‌లోనూ పిచ్‌లను తయారు చేసిన అనుభవం ఉంది. బీసీసీఐ సీనియర్‌ క్యురేటర్ తపోష్ ఛటర్జీతో కలిసి పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని