Shakib Al Hasan : మరో వివాదంలో చిక్కుకున్న షకీబ్ అల్ హసన్!

బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్ షకిబ్‌ అల్ హసన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. మూడేళ్ల కిందట భారత్‌కు చెందిన బుకీతో కలిసి అవినీతికి...

Published : 06 Aug 2022 01:33 IST

(ఫొటో సోర్స్‌: షకిబ్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెటర్ షకీబ్‌ అల్ హసన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. మూడేళ్ల కిందట భారత్‌కు చెందిన బుకీతో కలిసి అవినీతికి పాల్పడినట్లు తేలడంతో షకీబ్‌పై ఐసీసీ ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టుతో మరోసారి ఇరకాటంలో పడ్డాడు. అయితే వివాదాస్పదం కావడంతో ట్విటర్‌ నుంచి ఆ పోస్టును తొలగించాడు. బెట్‌విన్నర్‌ అనే న్యూస్‌ ఛానల్‌తో జట్టు కట్టినట్లు షకీబ్ మరొక పోస్టు పెట్టాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో దీనిపై బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) విచారణకు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌ చట్టం ప్రకారం గ్యాంబ్లింగ్‌ సంబంధిత కార్యకలాపాలకు అవకాశం కల్పించడంతోపాటు ప్రమోట్‌ చేయడం నేరం. షకీబ్ తొలుత పెట్టిన పోస్టు బెట్టింగ్‌కు అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. దీనిపైనే బీసీబీ విచారణకు ఆదేశించినట్లు క్రిక్‌బజ్‌ కథనం పేర్కొంది. ఇప్పటికే షకీబ్‌కు నోటీసు జారీ చేసినట్లు బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హస్సన్‌ ప్రకటించారు.

‘‘ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది అనుమతి తీసుకోవడం.. అయితే మేం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంతేకాకుండా ఎలాంటి పర్మిషన్‌ కూడా షకీబ్ మమ్మల్ని అడగలేదు. ఇక రెండోది.. అతడు నిజంగా అలాంటి డీల్‌ మీద సైన్‌ చేశాడా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. దానికోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాం. ఒకవేళ షకీబ్‌ డీల్‌కు ఓకే అంటే షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించి ఆ మేరకు చేశాం. బెట్టింగ్‌కు సంబంధించి ఉంటే మాత్రం మేం ఉపేక్షించం. అసలేం జరిగిందో తెలుసుకుంటాం. బంగ్లా క్రికెట్‌లోనే కాకుండా దేశంలోనే బెట్టింగ్‌ వంటివాటిపై నిషేధం ఉంది. ఇలాంటి సీరియస్‌ విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తాం. కేవలం ఫేస్‌బుక్ పోస్టింగ్‌ వంటివాటిపై ఆధారపడి నిర్ణయం తీసుకోం. ఇన్వెస్టిగేషన్‌ తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటాం’’ అని నజ్ముల్ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని