CWG 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌.. క్రీడా గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందిపడిన భారత బాక్సర్‌

బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌ 2022 ప్రారంభ వేడుకలు నిన్న రాత్రి అట్టహాసంగా జరిగాయి. ప్రపంచదేశాలకు చెందిన ...

Published : 29 Jul 2022 20:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌ 2022 ప్రారంభ వేడుకలు నిన్న రాత్రి అట్టహాసంగా జరిగాయి. ప్రపంచదేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామాలకు చేరారు. తొలి రౌండ్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. అయితే తాజాగా భారత బాక్సర్‌, ఒలింపిక్‌ పతక విజేత లవ్లీనా బొర్గొహెయిన్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఇబ్బందిపడినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే...?

గురువారం రాత్రి కామన్వెల్త్‌ ప్రారంభ వేడుకలు జరుగుతున్న వేళ లవ్లీనా అక్కడి నుంచి క్రీడా గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమెతోపాటు మరో క్రీడాకారుడు ముహమ్మద్ హుసముద్దిన్ ఉన్నాడు. ‘‘ఉదయాన్నే ట్రైనింగ్‌ సెషన్ కోసం వెళ్లాల్సి ఉంది. అయితే ఓపెనింగ్‌ వేడుకలు దాదాపు రెండున్నర గంటలపాటు జరిగాయి. అందుకే కొంచెం త్వరగా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. క్రీడా గ్రామానికి వెళ్లేందుకు ట్యాక్సీ కోసం సంప్రదించినా అందుబాటులోకి రాలేదు’’ అని లవ్లీనా తెలిపింది. భారత క్రీడాకారులు, ప్రతినిధుల కోసం కామన్వెల్త్‌ నిర్వాహకులు మూడు కార్లను అందించారు. అయితే అథ్లెట్లు, అధికారులు ప్రారంభ వేడుకలకు బస్సుల్లో వచ్చారు. దీంతో కార్ల డ్రైవర్లు అందుబాటులో ఉండలేకపోయారు. 

ఈ పరిణామాలపై భారత ఇన్‌ఛార్జ్‌ రాజేశ్‌ భండారీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మేం ప్రారంభ వేడుకల్లో నిమగ్నమై ఉన్నాం. లవ్లీనా, మరొక బాక్సర్‌ వెళ్లిపోయారని తర్వాత తెలిసింది. మేమంతా బస్సులో రావడంతో టాక్సీ అందుబాటులో ఉండకుండా పోయింది. ముందే వెళ్లాలని అనుకుంటే ఇక్కడకు రాకుండా ఉంటే సరిపోయేది. చాలా మంది అథ్లెట్లు ప్రారంభోత్సవానికి రాలేదు. వర్కౌట్‌ చేసుకోవాలని క్రీడా గ్రామంలోనే ఉండిపోయారు. వారికి కూడా తదుపరి రోజు పోటీ ఉంది. దానిని మేం అర్థం చేసుకోగలం. బాక్సింగ్‌ టీమ్‌తోనే మాట్లాడతా’’ అని రాజేశ్‌ భండారీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని