IND vs PAK: భారత్‌ vs పాక్‌ మ్యాచ్‌పై రికీ పాంటింగ్‌ జోస్యం

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కున్న క్రేజే వేరు.

Updated : 13 Aug 2022 10:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కున్న క్రేజే వేరు. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. మళ్లీ ఇప్పుడు యూఏఈ వేదికగా ఆసియాకప్‌లో ఈ నెల 28న ఇండో-పాక్‌ సమరం జరగనుంది. ఇరు జట్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు సహజం. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే చర్చ మొదలైంది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ ఈ మ్యాచ్‌ విజేత ఎవరనేది జోస్యం చెప్పాడు.

పాంటింగ్‌ ఐసీసీ రివ్యూ ఎసిసోడ్‌లో మాట్లాడుతూ ‘ఏ టోర్నమెంట్‌లోనైనా టీమ్‌ఇండియా కఠిన ప్రత్యర్థే. ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌లో డెప్త్‌ ఉంది. ఇది ఆ జట్టుకి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఆసియాకప్‌లో విజేత ఎవరంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో పాక్‌పై భారత్‌ ఆధిపత్యం చలాయిస్తే.. ఆసియా కప్‌లో మాత్రం ఇరుజట్లు  13 సార్లు తలపడితే.. భారత్‌ ఏడు గెలిస్తే.. పాకిస్తాన్‌ ఐదు గెలిచింది. ఒక మ్యాచ్‌ ఫలితం రాలేదు. కాబట్టి టోర్నీలో హోరాహోరీ పోరును అభిమానులు చూడొచ్చు. అయితే,  నా దృష్టిలో మాత్రం భారత్‌ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. నా ఓటు టీమిండియాకే.. ఆసియా కప్ కూడా టీమ్‌ఇండియానే గెలుస్తుందని నేను భావిస్తున్నాను. అయితే, పాక్‌ జట్టును అంత తేలికగా తీసేయడానికి లేదు. ఆ జట్టు ఈ మధ్య కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు సూపర్‌స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి పాక్‌తో టీమ్‌ఇండియాకు ప్రమాదం ఉంది’ అని రికీ విశ్లేషించాడు.

‘ఇంకో 15-20 ఏళ్లయినా సరే.. భారత్‌, పాక్‌ మ్యాచ్‌కున్న క్రేజ్ తగ్గదు. ఒక క్రికెట్‌ ప్రేమికుడిగా, పరిశీలకుడిగా ఇటువంటి మ్యాచులను చూస్తే ఆనందంగా ఉంటుంది. క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లను అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగానే చూస్తారు. కానీ యాషెస్‌ లాంటి టెస్టు సిరీస్‌కు మాత్రమే ఇది పరిమితం. అదే భారత్‌, పాక్‌ మధ్య ఉన్న ఆధిపత్య దోరణి అలా ఉండదు. ఏ ఫార్మాట్‌లోనైనా ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తిని పుట్టిస్తుంది’ అని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇక భారత్, పాక్‌ టెస్టు క్రికెట్‌లో తలపడితే చూడాలని ఉందని.. అసలు మజా టెస్టుల్లోనే ఉంటుందని పాంటింగ్‌ చెప్పాడు. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్లు చివరిసారిగా 2007 బెంగుళూరు టెస్టులో ఆడాయి. అయితే, వచ్చే ఏడాది జరగనున్న టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌కు వెళ్తే అభిమానులు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ఆసక్తికర పోరు చూసే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు