Ricky Ponting: టీమ్‌ఇండియా కోచ్‌ పదవికి నేను అంగీకరించలేదు.. ఎందుకంటే.? : రికీ పాంటింగ్‌

టీమ్ ఇండియా హెడ్‌ కోచ్‌ పదవికి తొలుత తననే సంప్రదించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. అయితే, పని ఒత్తిడి కారణంగా అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నాడు.

Published : 18 Nov 2021 23:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ ఇండియా హెడ్‌ కోచ్‌ పదవికి తొలుత తననే సంప్రదించారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ వెల్లడించాడు. అయితే, పని ఒత్తిడి కారణంగా అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవి కాలం ముగియడంతో.. రాహుల్ ద్రవిడ్‌ ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘ఐపీఎల్ జరుగుతున్న సమయంలో కొంతమంది నన్ను సంప్రదించారు. టీమ్‌ ఇండియా హెడ్ కోచ్‌ పదవిని చేపట్టాలని కోరారు. నేను అప్పటికే దిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మెంటార్‌గా వ్యవహరిస్తుండటంతో అందుకు అంగీకరించలేదు. అయితే, టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టుకు నన్ను కోచ్‌గా ఆహ్వానించడం గర్వంగా అనిపించింది’ అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన రికీ పాంటింగ్‌ గతంలో ముంబయి ఇండియన్స్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. 2018 నుంచి దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకి మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే, రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్ఇండియా హెడ్ కోచ్‌ పదవి చేపట్టేందుకు అంగీకరించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పాంటింగ్‌ అన్నాడు. ‘కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేసి అతడు టీమ్‌ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా అతడు ఎంతో మంది యువ క్రికెటర్లను తయారు చేశాడు. తొలుత నన్ను సంప్రదించిన వ్యక్తులే ద్రవిడ్‌ని ఒప్పించారనుకుంటున్నాను. భారత జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి ద్రవిడే సరైనోడు’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని