IND vs SA: శతక్కొట్టిన రోసోవ్‌.. భారత్‌ ఎదుట భారీ లక్ష్యం

దక్షిణాఫ్రికా బ్యాటర్లు వీర విహారం చేశారు. నామమాత్రమైన మూడో వన్డేలో భారత్‌కు దక్షిణాఫ్రికా భారీ లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 227/3 స్కోరు చేసింది. రోసోవ్ (100*) శతకం బాదాడు.

Updated : 04 Oct 2022 20:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నామమాత్రమై మ్యాచ్‌లో సఫారీ జట్టు చెలరేగింది. ఇండోర్‌ వేదికగా జరుగుతోన్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఎదుట దక్షిణాఫ్రికా 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌండరీ లైన్‌ చిన్నది కావడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. మరీ ముఖ్యంగా గత రెండు మ్యాచుల్లో విఫలమైన రిలీ రోసోవ్‌ (100*: 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం సాధించాడు. అదే విధంగా ఓపెనర్‌ క్వింటన్ డికాక్ (68: 43 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) జోరు కొనసాగించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్ (23), డేవిడ్ మిల్లర్ (19*: 4 బంతుల్లో 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. బవుమా (3) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్ చాహర్ చెరో వికెట్‌ తీశారు. 

చెలరేగిన రోసోవ్-డికాక్‌

బవుమా (3) విఫలమైనప్పటికీ.. రోసోవ్‌తో కలిసి డికాక్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 90 పరుగులను జోడించారు. డికాక్‌ ఉన్నంత వరకు కాస్త ఆచితూచి ఆడిన రొసోవ్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. డికాక్‌ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టబ్స్‌తో కలిసి రోసోవ్‌ వీర విహారం చేశాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును 200 పరుగులు దాటించడంతోపాటు శతకం పూర్తి చేసుకొన్నాడు. ఇదే అతడికి తొలి సెంచరీ కావడం విశేషం. చివర్లో డేవిడ్ మిల్లర్‌ కూడా ధాటిగా ఆడి వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని