Pant: రాత్రి 3:30కు తలుపు తట్టిన పంత్‌

క్షమాపణ చెప్పేందుకు రాత్రి 3:30 గంటలకు రిషభ్‌ పంత్‌ తన ఇంటికొచ్చాడని అతడి చిన్ననాటి కోచ్‌ సిన్హా తెలిపారు. ఒకసారి నెట్స్‌లో అతడి ప్రదర్శన చూసి నిరాశ చెందానన్నారు. దాంతో నిద్రపట్టని అతడు గంటకు పైగా కారు నడుపుతూ తన ఇంటికొచ్చాడని గుర్తు చేసుకున్నారు.

Published : 30 May 2021 01:31 IST

అది మనసును తాకిందన్న చిన్ననాటి కోచ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్షమాపణ చెప్పేందుకు రాత్రి 3:30 గంటలకు రిషభ్‌ పంత్‌ తన ఇంటికొచ్చాడని అతడి చిన్ననాటి కోచ్‌ సిన్హా తెలిపారు. ఒకసారి నెట్స్‌లో అతడి ప్రదర్శన చూసి నిరాశ చెందానన్నారు. దాంతో నిద్రపట్టని అతడు గంటకు పైగా కారు నడుపుతూ తన ఇంటికొచ్చాడని గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పంత్‌ ప్రవేశించి కొద్దికాలమే అయిందన్నారు. అందుకే ఎంఎస్‌ ధోనీతో పోల్చొద్దన్నారు.

రిషభ్‌ పంత్‌ పుట్టింది ఉత్తరాఖండ్‌లో. కానీ పెరిగింది మాత్రం దిల్లీలోనే. ఎక్కువ కాలం అతడు సోనెట్‌ క్రికెట్‌ క్లబ్‌లోనే శిక్షణ పొందాడు. దానికి హెడ్‌కోచ్‌గా సిన్హా ఉండేవారు. పంత్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. దిల్లీ తరఫునే రంజీలు ఆడిన పంత్‌ ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

‘దక్షిణ దిల్లీలోని సోనెట్‌ క్లబ్‌లో ఒకసారి నెట్‌ సెషన్‌లో పంత్‌ ఆటను చూసి నిరాశ చెందా. ఆ రాత్రి అతడు నిద్రపోలేదు. రాత్రి 3:30 గంటలకు మా ఇంటి తలుపు తట్టాడు. మేముండే వైశాలికి అతనుండే చోటు నుంచి రావాలంటే గంటన్నరకు పైగా సమయం పడుతుంది. అతడు తలుపు తట్టిన వెంటనే ఈ సమయంలో ఎందుకొచ్చాడని అనుకున్నా. కోచ్‌గా నేను నిరాశపడటం మునుపెన్నడూ చూడలేదంటూనే, క్షమాపణ చెప్పడానికి వచ్చానని తెలిపాడు. అది నా మనసును తాకడమే కాకుండా అర్ధరాత్రి తర్వాత రావడం కలచివేసింది. నిజానికి అతడిపై కఠినంగా ఉన్నందుకు నా కుటుంబ సభ్యులూ బాధపడ్డారు’ అని సిన్హా తెలిపారు.

పంత్‌ను ధోనీతో పోల్చడం తొందరపాటే అవుతుందని సిన్హా అన్నారు. ముందు అతడు ఆటగాడిగా నిలదొక్కుకోవాలని సూచించారు. ఇంకా చెప్పాలంటే నాయకత్వం చేపట్టకముందే విరాట్‌ కోహ్లీ, ధోనీ వంటి గొప్ప క్రికెటర్లు ఎంతో శ్రమించారని పేర్కొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని