Rishabh Pant : మరో అరుదైన రికార్డు సాధించిన పంత్‌..

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో లుంగి ఎంగిడి ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా.. టెస్టుల్లో 100..

Published : 05 Jan 2022 11:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మరో అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో లుంగి ఎంగిడి ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా.. టెస్టుల్లో 100 క్యాచులు పట్టిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పంత్ కేవలం 27 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 256 క్యాచులతో తొలి స్థానంలో నిలవగా.. మాజీ ఆటగాళ్లు సయ్యద్ కిర్మాణీ (160 క్యాచులు), కిరణ్‌ మోరె (110) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతకు ముందు, సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచులో పంత్‌.. ధోని రికార్డును బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 26 టెస్టుల్లోనే 100 డిస్మిసల్స్ (క్యాచ్‌ + స్టంపౌట్లు) నమోదు చేసిన ఆటగాడిగా రిషభ్ పంత్‌ చరిత్రకెక్కాడు. మాజీ క్రికెటర్‌ ధోని 36 టెస్టుల్లో 100 డిస్మిసల్స్ నమోదు చేసి రెండోస్థానంలో నిలిచాడు.

ఇదిలా ఉండగా, జొహాన్నెస్ బర్గ్‌లో జరుగుతోన్న రెండో టెస్టులో.. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం ఛెతేశ్వర్‌ పుజారా (35: 42 బంతుల్లో 7×4), అజింక్య రహానె (11: 22 బంతుల్లో 1×4) క్రీజులో కొనసాగుతున్నారు. భారత్‌ మూడో రోజు ఆటలో బ్యాటుతో రాణించి.. ఆతిథ్య సఫారీల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఆలోచనలో ఉంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం, తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసి 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు