Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్‌ చోప్రా

భారత కెప్టెన్సీకి రోహిత్‌ శర్మ వీడ్కోలు పలికితే ఆ బాధ్యతను చేపట్టడానికి శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌పంత్‌లకు అర్హత ఉందని భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

Published : 29 Jan 2023 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తు క్రికెట్‌లో భారత సుదీర్ఘ కాల కెప్టెన్సీకి శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌పంత్‌ అర్హులని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌ వరకు మాత్రమే రోహిత్ టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని అన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌, ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న పొట్టి ఫార్మాట్‌లో హార్ధిక్‌ పాండ్య సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే తర్వాతి కెప్టెన్‌ ఎవరనే అంశంపై ఇటీవల చర్చలు మొదలయ్యాయి. మాజీ సారథి ధోని మాదిరిగా రోహిత్‌ సైతం కెప్టెన్సీ బాధ్యతలను యువఆటగాళ్లకు అప్పగించాలని ఇటీవల మాజీలు సూచించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యే అర్హత గల ఆటగాళ్ల గురించి మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. తాజాగా ఆకాశ్‌ చోప్రా స్పందించాడు.

‘‘ ఒక వ్యక్తి అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్‌గా ఉండడం ఇక ముందు జరగదు. ఆ రోజులు పోయాయి. టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.  పొట్టి ఫార్మాట్‌కు ప్రస్తుతం హార్ధిక్‌ పాండ్య సారథ్యం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ హార్ధిక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఆశిస్తున్నా. ఇక వన్డే క్రికెట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ వరకు కొనసాగుతుండొచ్చు. భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు భారత జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడానికి శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌పంత్‌ అర్హులు’’ అని ఆకాశ్‌పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని