Ban vs Ind: రిషభ్‌ పంత్‌ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత రెండో వికెట్ కీపర్‌గా..

టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో 46 పరుగులు చేసి ఔటైన పంత్‌  అంతర్జాతీయ క్రికెట్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన  రెండో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. 

Published : 14 Dec 2022 19:39 IST

ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో సైతం టీ20 క్రికెట్‌ను మరిపించేలా దూకుడుగా ఆడే టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్ (‌Rishabh Pant) అరుదైన  రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ల్‌లో పంత్‌ (46; 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకానికి చేరువై ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా పంత్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 4,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల పరుగులు చేసిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పంత్‌ కంటే ముందు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Dhoni) అగ్రస్థానంలో ఉన్నాడు. 

ధోనీ తన కెరీర్‌లో 535 మ్యాచ్‌లు ఆడి 44.74 సగటుతో 17,092 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 108 అర్ధ సెంచరీలున్నాయి. ఇక, రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడి 33.78 సగటుతో 4,021 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా పంత్‌ 109 మ్యాచ్‌ల్లో 3,651 పరుగులు చేయగా.. 6 శతకాలు, 15 అర్ధ శతకాలు బాదాడు. 

ఈ మ్యాచ్‌లో పంత్‌ మరో రికార్డును కూడా అందుకున్నాడు. టెస్టుల్లో వేగవంతంగా 50 సిక్స్‌లు బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ 54 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించగా.. పంత్‌ 51 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో 50 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు పంత్. ఈ జాబితాలో సెహ్వాగ్‌ 91 సిక్స్‌లతో మొదటి స్థానంలో ఉండగా ధోనీ (78), సచిన్‌ (69), రోహిత్ శర్మ (64), కపిల్‌ దేవ్ (61), గంగూలీ (57), రవీంద్ర జడేజా (55) సిక్స్‌లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని