Rishabh Pant: పంత్‌ జోకులేసి నవ్విస్తాడు

నైపుణ్యాల పరంగా తాను వెనకబడలేదని టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. మైదానంలో రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే జట్టులో...

Published : 27 May 2021 12:31 IST

జడ్డూ ప్రదర్శనలతో నాకు చోటు దొరకలేదు: అక్షర్‌ పటేల్‌

ముంబయి:  నైపుణ్యాల పరంగా తాను వెనకబడలేదని టీమ్‌ఇండియా యువ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. మైదానంలో రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే జట్టులో చోటు దొరకడం లేదని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌ తనకు అత్యంత సన్నిహితుడని వెల్లడించాడు. మైదానంలో ఆట స్తబ్దుగా సాగుతుంటే జోకులు పేల్చే బాధ్యత అతడే తీసుకుంటాడని వెల్లడించాడు. ఆరేళ్ల క్రితమే అక్షర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడికి జట్టులో చోటు దొరకలేదు. కొన్నాళ్ల క్రితం ఇంగ్లాండ్‌ టెస్టు సిరీసులో అతడు దుమ్మురేపాడు. 3 టెస్టుల్లో 27 వికెట్లు తీశాడు.

‘నా నైపుణ్యాల్లో కొరత ఉందనుకోను. దురదృష్టవశాత్తు గాయపడటంతో వన్డేల్లో చోటు కోల్పోయాను. ఇక టెస్టుల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతంగా ఆడుతున్నారు. జడ్డూ అత్యుత్తమ ఆటతీరుతో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం కష్టం. మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ రాణిస్తున్నారు. జట్టు కూర్పు వల్లే నాకు చోటు దొరకలేదు. మళ్లీ అవకాశం దొరకగానే నన్ను నేను నిరూపించుకున్నా’ అని అక్షర్‌ అన్నాడు.

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ తన సన్నిహితుల్లో ఒకడని అక్షర్‌ చెప్పాడు. జట్టు వాతావరణాన్ని సరదాగా మార్చడంలో, జోకులు పేల్చడంలో అతడికి తిరుగులేదని పేర్కొన్నాడు. ‘అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో మా ఇద్దరిదీ ఒకే జట్టు. పంత్‌ నాకు సన్నిహితుడు. జట్టు వాతావరణంలో అతడు జోష్‌ నింపుతాడు. వికెట్ల వెనకాల ఉండీ అతడు జోకులు పేల్చగలడు. కొన్నిసార్లు టెస్టుల్లో ప్రత్యర్థి భాగస్వామ్యాలు విడదీయడం కష్టమవుతుంది. ఆటగాళ్లు నిరుత్సాహ పడకుండా వారిలో ఉత్సాహం నింపే బాధ్యతను అతడు తీసుకుంటాడు. అంతేకాకుండా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అతడికవి నప్పుతాయి’ అని అక్షర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు