స్వదేశంలో సాహా.. విదేశంలో పంత్‌

టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్‌పంత్‌ తన వికెట్‌కీపింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. భారత పిచ్‌లపై ఆడేటప్పుడు నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు...

Published : 23 Dec 2020 02:12 IST

టీమ్‌ఇండియాకు ఎమ్మెస్కే సూచన

ముంబయి: టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్‌పంత్‌ తన వికెట్‌కీపింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సూచించారు. భారత పిచ్‌లపై ఆడేటప్పుడు నాణ్యమైన స్పిన్‌ బౌలింగ్‌లో కీపింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నారు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు వృద్ధిమాన్‌ సాహా, విదేశాల్లో ఆడుతున్నప్పుడు పంత్‌ను తొలి ప్రాధాన్య కీపర్‌గా ఎంచుకోవాలని కోరారు.

‘ఉపఖండం పిచ్‌లపై నాణ్యమైన అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ స్పిన్‌లో కీపింగ్‌ చేయాలంటే అద్భుత నైపుణ్యాలు అవసరం. రిషభ్ పంత్‌ వీటిని మెరుగుపర్చుకోవాలి. అదే విదేశాల్లో ఆడినప్పుడు ఇలాంటి పరిస్థితులు తక్కువ. ప్రస్తుతం పంత్‌ గడ్డు కాలం అనుభవిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ స్థాయి తగ్గింది. అయితే కష్టపడితే అతడు మెరవగలడు. వార్మప్‌ మ్యాచులో అతడు శతకం బాదిన సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తే సాహా బదులు మిగిలిన టెస్టుల్లో పంత్‌ను తీసుకోవడం మంచిది. సాహా మంచి వికెట్‌కీపరే అయినా విదేశాల్లో బ్యాటింగ్‌ పరంగా బలహీనం. రిషభ్ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల్లో శతకాలు బాదాడు. ఎంతో ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యం. అందుకే భారత్‌లో సాహా, విదేశాల్లో పంత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ఎమ్మెస్కే అన్నారు.

అడిలైడ్‌లో టీమ్‌ఇండియా పొరపాటు చేసిందని ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. అక్కడ సాహా బదులు పంత్‌కు చోటిస్తే బాగుండేదని పేర్కొన్నారు. ‘పంత్‌ ఫిట్‌గా లేకపోవడంతోనే తీసుకోలేదన్నది నిజమే. అతడు మ్యాచ్‌కు ముందే ఫిట్‌నెస్‌ సాధించాల్సింది. అతడు తుది జట్టులో చోటు దక్కించుకొని ఉంటే భారత్‌కు అదనంగా మరో బ్యాట్స్‌మన్‌ లభించేవాడు. తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకోవడం అవసరం. విఫలమవుతున్న రిషభ్‌కు మరిన్ని అవకాశాలివ్వాలి. మిగతా మూడు టెస్టుల్లో ఆడుతున్నావని ఆత్మవిశ్వాసం అందించాలి. అప్పుడే అతడు స్వేచ్ఛగా ఆడగలడు. అతడిలో ధీమా నింపితే కచ్చితంగా రాణిస్తాడు’ అని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి
2020.. కోహ్లీ ఏంటి?
క్రికెటర్‌ సురేశ్ రైనా అరెస్టు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని