IND vs SA: ధోని రికార్డును పంత్‌ అధిగమిస్తాడా?

దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పర్యటనలో అదరగొట్టిన టీమ్‌ఇండియా అదే ఊపుతో దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ సాధించి..

Updated : 23 Dec 2021 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పర్యటనలో అదరగొట్టిన టీమ్‌ఇండియా అదే ఊపుతో దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలన్న కసితో ఉంది. మరో వైపు హెడ్ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కిదే తొలి విదేశీ పర్యటన కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు భారత ఆటగాళ్లు అరుదైన రికార్డులకు చేరువయ్యారు.

* తొలి భారత ఆటగాడిగా రిషభ్‌ రికార్డు..

టెస్టు క్రికెట్లో అతి తక్కువ మ్యాచుల్లో 100 డిస్మిసల్స్‌ (క్యాచ్‌ ఔట్లు + స్టంపౌట్లు) నమోదు చేసిన భారత ఆటగాడిగా రిషభ్ పంత్‌ రికార్డు సృష్టించనున్నాడు. రిషభ్ ఇప్పటి వరకు 25 టెస్టుల్లో 97 డిస్మిసల్స్‌ (89 క్యాచులు + 8 స్టంపౌట్లు) చేశాడు. దీంతో భారత మాజీ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 36 టెస్టుల్లో 100 డిస్మిసల్స్‌ రికార్డుకు చేరువయ్యాడు. ఈ టెస్టు సిరీస్‌లో రిషభ్‌ పంత్‌.. ధోనిని అధిగమించడం లాంఛనమే.!

* మూడు వికెట్ల దూరంలో బుమ్రా..

టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా.. విదేశాల్లో వంద వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. విదేశాల్లో 22 టెస్టులు ఆడిన అతడు 97 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో ఆడిన 2 టెస్టుల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లే తీయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే స్వదేశంలో కంటే విదేశాల్లోనే అతడి రికార్డు మెరుగ్గా ఉందనే విషయం స్పష్టమవుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు 24 టెస్టులు ఆడిన బుమ్రా 101 వికెట్లు తీశాడు. కాగా, 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా బుమ్రా టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

* 200 వికెట్ల క్లబ్‌లోకి షమి..

సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి ఇప్పటి వరకు ఆడిన 54 టెస్టుల్లో 195 వికెట్లు తీశాడు. మరో ఐదు వికెట్లు పడగొడితే 200 వికెట్ల క్లబ్‌లోకి చేరుతాడు. ఇతని కంటే ముందు కపిల్‌ దేవ్, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, జవగళ్‌ శ్రీనాథ్‌ వంటి పేసర్లు మాత్రమే రెండు వందలకు పైగా వికెట్లు తీశారు. ఈ సిరీస్‌లో షమి మరో 5 వికెట్లు పడగొడితే ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా చరిత్రకెక్కనున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు వీళ్లంతా అందుబాటులోకి రానున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని