WTC Finals:‘పంత్ వల్లే  భారత్‌కు ఈ స్థానం’

టీమిండియా గత నాలుగైదేళ్లుగా  టెస్టు క్రికెట్‌లో మంచి ఆటతీరును కనబరుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ అతిథ్య జట్లపై అధిపత్యం చెలాయించి సిరీస్‌లను చేజిక్కించుకుంది.

Published : 20 May 2021 23:15 IST

(photo: Rishabh Pant Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా గత నాలుగైదేళ్లుగా  టెస్టు క్రికెట్‌లో మంచి ఆటతీరును కనబరుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లోనూ అతిథ్య జట్లపై అధిపత్యం చెలాయించి సిరీస్‌లను చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే టెస్టుల్లో పూర్వవైభవాన్ని పొంది  ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది.  ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌కు కూడా  చేరుకుంది.  సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ఈ చారిత్రాత్మక పోరులో భారత్‌ను న్యూజిలాండ్‌ ఢీ కొట్టనుంది. 

 అయితే, భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరడంలో  కెప్టెన్‌ విరాట్ కోహ్లి,ఛతేశ్వర్‌ పూజారా, బౌలర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా కీలకపాత్ర  పోషించారు. అయితే, టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్  అతి ముఖ్యమైన పాత్ర పోషించడం వల్లే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరిందని భారత మాజీ క్రికెటర్‌ సబా కరీం అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్ మంచి ప్రదర్శన చేయాలి. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ చేరడంలో  పంత్‌ ముఖ్యభూమిక పోషించిన విషయాన్ని మనం మార్చిపోకూడదు.  టీమిండియా ఈ స్థితిలో నిలవడానికి కారణం ఎవరని  మీరు నన్ను అడిగితే భారత టెస్టు జట్టు మొత్తంలో బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా రిషభ్ పంత్ అతిపెద్ద పాత్ర పోషించాడని చెబుతా.

‘పంత్  టెస్టు జట్టులోకి వచ్చినప్పటి నుంచి జట్టు కూర్పు చాలా బాగుంది. పంత్‌ ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగడం వల్ల కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఐదుగురు బౌలర్లను తుది జట్టులోకి తీసుకుంటున్నాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే పంత్‌.. వేగంగా పరుగులు రాబడుతూ జట్టుకు విజయాలనందించే కీలక ఇన్నింగ్స్‌లు ఆడగలడని విరాట్‌కి తెలుసు’ అని సబా కరీం అన్నాడు.

ఇక, గత కొన్నాళ్లుగా టీమిండియాకు  టెస్టుల్లో పంత్ కీలకంగా మారాడు. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా అన్ని చోట్ల మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని భారత్ ముద్దాడటంలో పంత్ కీలకపాత్ర పోషించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా  పంత్ నుంచి టీమిండియా మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది.

 
 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని