Rishabh Pant: నేను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి: రిషభ్‌ పంత్‌

గతరాత్రి హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (92 నాటౌట్‌; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్‌.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ప్రశంసలు కురిపించాడు...

Published : 06 May 2022 11:22 IST

(Photo: Rishabh Pant Instagram)

ముంబయి: గతరాత్రి హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (92 నాటౌట్‌; 58 బంతుల్లో 12x4, 3x6) విధ్వంసక బ్యాటింగ్‌.. తాను చూసిన అతిగొప్ప ఇన్నింగ్స్‌ల్లో ఒకటని దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వార్నర్‌కు తోడుగా రోవ్‌మన్‌ పావెల్‌ (67 నాటౌట్‌; 35 బంతుల్లో 3x4, 6x6) దంచికొట్టడంతో నాలుగో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే వారిద్దరి బ్యాటింగ్‌ను కెప్టెన్‌ మెచ్చుకున్నాడు.

‘మేం మెరుగవ్వడానికి ఎప్పుడూ అవకాశాలు ఉన్నాయి. కానీ, బ్యాటింగ్‌ పరంగా ఈ మ్యాచ్‌ మాకు సరైన గేమ్‌లా అనిపించింది. మేం నిర్దేశించిన లక్ష్యం చూసి నేను ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే 200పై చిలుకు లక్ష్య ఛేదనలో ఏ జట్టు అయినా విజయం సాధించాలంటే ఓవర్‌కు 10-12 పరుగులు రాబట్టాలి. అలా 20 ఓవర్ల వరకూ ఆడటం అంత తేలిక కాదు. దీన్నిబట్టే మా బౌలర్లకు ప్రశాంతంగా ఉంటూ బౌలింగ్‌ చేయమని చెప్పా. ఇక వార్నర్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే.. అతడు ఆడిన విధానం, ఇన్నింగ్స్‌ను సాగించిన తీరు అమోఘం. నేను చూసిన అత్యుత్తమ బ్యాటింగ్‌లో ఇదొకటి. పావెల్‌ గురించి అందరికీ తెలిసిందే. అతడిని వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఇలా చెలరేగుతున్నాడు. ఇప్పుడు మేం ఒక్కో మ్యాచ్‌పైనే శ్రద్ధ వహిస్తున్నాం. అయితే, ఈ విజయం చాలా ముఖ్యమైనది’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

అనంతరం డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ.. తనకు నచ్చినట్లు షాట్లు ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయన్నాడు. ‘ఈ వికెట్‌ చాలా బాగుంది. నాకు తోడుగా పావెల్‌ అద్భుతంగా ఆడాడు. ఇక హైదరాబాద్‌పై చెలరేగడానికి నాకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదు. ఆ జట్టుపై విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇక నేను ఆడిన స్విచ్‌ షాట్‌ (కుడి చేతి బ్యాటింగ్‌) బంతిని భువనేశ్వర్‌ యార్కర్‌ వేస్తాడని ఊహించా. కానీ, అతడు వికెట్లకు దూరంగా బంతిని  వేశాడు. దీంతో నేను స్విచ్‌ షాట్‌కు ప్రయత్నించాను. సహజంగా ఈ షాట్‌ జోస్‌ బట్లర్‌ ఆడతాడు‌. దాన్ని నెట్స్‌లో సాధన చేసి ఇక్కడ ఉపయోగించాను. అయితే, తొలుత దాన్ని రివర్స్‌ షాట్‌ ఆడదామనుకున్నా.. కానీ, ఆ బంతి పడిన విధానం చూసి కట్‌ షాట్‌ ఆడాను’ అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ చివరి వరకూ పోరాడింది. ఆఖరికి 186/8తో నిలిచి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ జట్టులో నికోలస్‌ పూరన్‌ (62) రాణించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని