Rishabh Pant: అఫ్రిదికి చేరువలో పంత్.. ఈసారి విరుచుకుపడితే రికార్డు బద్దలే!

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో జాక్‌ లీచ్‌ బౌలింగ్‌ చేసి, పంత్‌ తనదైన శైలిలో చెలరేగితే అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టేస్తాడు.

Published : 04 Jul 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  టెస్టు క్రికెట్‌లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటర్లను చాలామందిని చూసుంటారు. అయితే రికార్డు స్థాయిలో బంతిని బ్యాటుతో చెడుగుడు ఆడేవాళ్లు తక్కువే. ఆధునిక టెస్ట్‌ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌, షాహిద్‌ అఫ్రిది, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఈ కోవకు చెందినవారు. వీరంతా క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమవుతోంది. ప్రస్తుత క్రికెట్‌లో అయితే రిషబ్‌ పంత్‌, జానీ బెయిర్‌స్టో లాంటివారు తమ ఆటతో ఆ దిగ్గజ క్రికెటర్ల బ్యాటింగ్‌ శైలిని గుర్తుచేస్తున్నారు. వారి రికార్డులపై కూడా కన్నేశారు.

ఆధునిక టెస్టు క్రికెట్‌లో (2001 నుంచి ఇప్పటివరకు) ఒకే బౌలర్‌ బౌలింగ్‌లో అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌తో వంద కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో షాహిద్‌ అఫ్రిది టాప్‌లో ఉన్నాడు. మన మాజీ స్పీడ్‌ స్టర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌లో అఫ్రిదీ 175 స్ట్రయిక్‌ రేట్‌తో (మొత్తం 7 ఇన్నింగ్స్‌లో) బ్యాటింగ్‌ చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్‌ ఇప్పుడు రిషబ్‌ పంత్‌కి వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌తో పంత్‌ జోరు కొనసాగితే... అఫ్రిదీ రికార్డు బద్దలవుతుంది. 

తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ చెలరేగి ఆడి 89 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తంగా 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లిష్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సర్లతో పంత్‌ విరుచుకుపడ్డాడు. అలా అఫ్రిదీ రికార్డుకు చేరువయ్యాడు. లీచ్‌ను ఏడు ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న పంత్‌ 161.53 స్ట్రయిక్‌ రేట్‌తో 147 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో జాక్‌ లీచ్‌ బౌలింగ్‌ చేసి, పంత్‌ తనదైన శైలిలో చెలరేగితే అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టేస్తాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ 46 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. పంత్‌ తర్వాతి స్థానంలో 140.54 స్ట్రయిక్‌ రేట్‌తో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని