Rishabh Pant: ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తో రిలాక్స్ అయిపోయా : రిషభ్‌ పంత్

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా రిషభ్‌ పంత్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మళ్లీ మైదానంలో అడుగు పెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.

Published : 07 Jul 2024 10:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) భారత్‌ నెగ్గడంలో రిషభ్ పంత్ పాత్ర కూడా కీలకమే. ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత మైదానంలోకి అడుగు పెట్టేందుకు ఈ భారత యువ క్రికెటర్ తీవ్రంగా శ్రమించాడు. ఆ ఫలితం టీ20 ప్రపంచ కప్‌ మెడల్‌ను అందించింది. పంత్ 2022 చివర్లో హైవేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత ఐపీఎల్‌తోనే మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాడు. అక్కడ సత్తా చాటడంతో వరల్డ్‌ కప్‌ కోస ప్రకటించిన టీమ్‌ఇండియాలో (Team India) స్థానం దక్కించుకున్నాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ప్రపంచ కప్‌ దక్కించుకున్న తర్వాత ఆటగాళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫోన్‌ కాల్‌ గురించి ప్రధానితో రిషభ్‌ పంచుకున్నాడు. ఆ కాల్‌ చేసింది మోదీనే కావడం గమనార్హం.

‘‘విశ్వవిజేతలం అయిన తర్వాత మమ్మల్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ వరల్డ్‌ కప్ ముందు నేను ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యా. ఆ సమయంలో మా అమ్మకు పీఎం ఫోన్‌ చేశారు. అప్పుడు నా కెరీర్‌ గురించి చాలా విషయాలు మదిలో తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మోదీ ఫోన్ చేశారని మా అమ్మ చెప్పారో.. ఇక నాకు ఎలాంటి సమస్య లేదనిపించింది. మానసికంగానూ రిలాక్స్‌ అయిపోయా.

గాయాల నుంచి కోలుకుంటున్న సమయంలో నేను మళ్లీ క్రికెట్‌ ఆడతానా? లేదా? అనేది పక్కన పెట్టేశా. వికెట్ కీపింగ్‌ చేయగలడా? లేదా అని బయట నుంచి కొన్ని వ్యాఖ్యలూ వినిపించాయి. దీంతో మరింత కష్టపడితే మైదానంలోకి అడుగు పెట్టడం కష్టమేం కాదని గ్రహించా. నేను తిరిగి ఆడగలనని నిరూపించుకోవడానికి ఈ క్లిష్ట పరిస్థితిని ఉపయోగించుకున్నా. భారత జట్టు విజయంలో నా వంతు భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని పంత్‌ (Rishabh Pant) తెలిపాడు. వరల్డ్‌ కప్‌లో పంత్ 8 మ్యాచుల్లో 171 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌లో వస్తూ జట్టుకు అండగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని