Rishabh Pant: తేమ ఉంటే చేసేదేంలేదు.. ఇంకా 10-15 పరుగులు చేయాల్సింది: పంత్

మైదానంలో తేమ అధికంగా ఉంటే చేసేదేం లేదని దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే...

Published : 08 Apr 2022 10:20 IST

(Photo: Rishabh Pant Instagram)

ముంబయి: మైదానంలో తేమ అధికంగా ఉంటే చేసేదేం లేదని దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అన్నాడు. గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దిల్లీ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన పంత్‌ ఇలా స్పందించాడు.

‘తేమ ఇలా ఉంటే ఎవరినీ తప్పుబట్టలేం. అక్కడ చేసేదేంలేదు. ఒక బ్యాటింగ్‌ యూనిట్‌గా మేం ఈ మ్యాచ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశాం. చివర్లో లఖ్‌నవూ బౌలర్లు అవేశ్‌ ఖాన్‌, జేసన్‌ హోల్డర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని కట్టడి చేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో గెలవాలని మేం బలంగా కోరుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు మా ఆటగాళ్లతో ఇదే చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి బంతివరకూ పోరాడాలని సూచించాను. ఇక బరిలోకి దిగాక పవర్‌ప్లేలో బాగా బౌలింగ్‌ చేసినా వికెట్లు దక్కలేదు. మధ్యలో మా స్పిన్‌ బౌలర్లు రాణించారు. అయినా, ఫలితం లేకుండా పోయింది’ అని పంత్‌ పేర్కొన్నాడు.

(Photo: KL Rahul Instagram)

ఇక కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ తమ బౌలింగ్‌ అద్భుతంగా ఉందన్నాడు. అయితే.. పవర్‌ప్లేలో వికెట్లు సాధించకపోవడానికి గల కారణాలపై కసరత్తు చేయాలన్నాడు. అయినా, ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురౌతాయని చెప్పాడు. ‘దిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే ముగిశాక పరిస్థితులను అర్థం చేసుకొని తర్వాత మెరుగ్గా బౌలింగ్ చేశాం. అంతకుముందే బౌలర్లు ఈ పని చేసి ఉంటే మరింత సంతోషించేవాడిని. టోర్నీ ఆరంభంలో పిచ్‌లు ఎలా స్పందిస్తాయనేది అర్థంకాదు. దీంతో తొలుత ఏ జట్టైనా టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకుంటుంది. మ్యాచ్‌లు జరిగేకొద్దీ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా మారతాయి. ఇక యువ బ్యాట్స్‌మన్‌ ఆయుష్‌ బదోనీ క్రీజులోకి దిగిన ప్రతిసారీ ఒత్తిడిని తట్టుకొని నిలబడతాడు. ఇప్పటివరకూ జట్టు సమష్టిగా రాణించింది. అందరూ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని లఖ్‌నవూ సారథి అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని