Rishabh Pant: కోహ్లీ తర్వాత రిషభ్‌ పంత్‌కే ఇలా చేదు అనుభవం..

యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. దీంతో అతడు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ సరసన నిలిచాడు...

Updated : 10 Jun 2022 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్: యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. దీంతో అతడు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ సరసన నిలిచాడు. గతరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 211 పరుగుల భారీ స్కోర్‌ సాధించినా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయింది. వాండర్‌ డసెన్‌ (75 నాటౌట్‌; 46 బంతుల్లో 7x4, 5x6), డేవిడ్‌ మిల్లర్‌ (64 నాటౌట్‌; 31 బంతుల్లో 4x4, 5x6) చెలరేగడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. దీంతో పంత్‌ తొలి టీ20లోనే కెప్టెన్‌గా విఫలమయ్యాడు.

2017లో విరాట్‌ కోహ్లీ సైతం ఇలాగే తొలిసారి టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి విఫలమయ్యాడు. కాన్పూర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పుడు కోహ్లీ 29 పరుగులు సాధించగా.. ఇప్పుడు పంత్‌ కూడా 29 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు భారత కెప్టెన్‌గా తొలి టీ20లో విఫలమై కోహ్లీ సరసన నిలిచాడు. అయితే, ఈ సిరీస్‌కు పంత్‌ అనూహ్యంగా కెప్టెన్‌ అయిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మకు విశ్రాంతి నివ్వడంతో తొలుత కేఎల్‌ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. కానీ, అతడు తొలి మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా తప్పుకోవడంతో రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని