Rishabh Pant: ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా.. సోషల్‌ మీడియాలో పంత్

కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మొదటిసారి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. 

Published : 17 Jan 2023 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్: కారు ప్రమాదంలో గాయపడి ముంబయిలో చికిత్స పొందుతున్న టీమ్ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్ పంత్‌ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, అభిమానులకు, వైద్యులకు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. కారు ప్రమాదానికి గురైన తర్వాత రిషభ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇదే తొలిసారి.

‘నాకు మద్దతుగా నిలిచిన అభిమానులు, సహచర ఆటగాళ్లు, వైద్యులు, ఫిజియోలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరినీ మైదానంలో చూడాలని ఎదురుచూస్తున్నాను. నా శస్త్రచికిత్స  విజయవంతమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం కోలుకుంటున్నాను. రాబోయే సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా వెన్నంటే ఉన్న బీసీసీఐకి, జై షాకు, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడిన రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌లకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ’ అని పంత్‌ ట్వీట్‌ చేశాడు.

పంత్‌ మోకాలి లిగ్మెంట్‌కు శస్త్రచికిత్స  చేశారు. అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం ఆరు నెలలు సమయం పట్టే అవకాశముంది. దీంతో ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 15 సీజన్‌కు పంత్‌ అందుబాటులో ఉండట్లేదు. ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌లకు కూడా రిషభ్ అందుబాటులో ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. పంత్‌ వేగంగా కోలుకొని వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని