Rishabh Pant: దినేశ్‌ కార్తీక్‌ క్రీజులోకి వెళ్లగానే చితక్కొట్టాడు : రిషభ్‌ పంత్

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ప్రత్యర్థి బౌలర్లను చావగొట్టాడని కెప్టెన్‌ రిషభ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్‌ వేదికగా గతరాత్రి జరిగిన కీలక పోరులో టీమ్‌ఇండియా 82 పరుగుల...

Updated : 18 Jun 2022 09:37 IST

రాజ్‌కోట్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టాడని కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్‌ వేదికగా గతరాత్రి జరిగిన కీలక పోరులో టీమ్‌ఇండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 2-2తో సమానంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 13 ఓవర్లకు 81/4తో కష్టాల్లో పడింది. ఆ సమయంలో జోడీ కట్టిన హార్దిక్‌ పాండ్య (46; 31 బంతుల్లో 3x4, 3x6), దినేశ్‌ కార్తీక్‌ (55; 27 బంతుల్లో 9x4, 2x6) గొప్పగా ఆడారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో టీమ్‌ఇండియా చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు సాధించి చివరికి 169/6 స్కోర్‌ చేసింది. ఈ క్రమంలోనే డీకే 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకం సాధించాడు.

మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ టీమ్‌ఇండియా ఆటతీరును మెచ్చుకున్నాడు. ‘మేం బాగా ఆడాలని ప్రణాళికలు వేసుకొని బరిలోకి దిగాం. దీంతో ఇలాంటి ఫలితం వచ్చింది. ఏ జట్టు బాగా ఆడితే అదే గెలుస్తుంది. తర్వాతి మ్యాచ్‌లోనైనా టాస్‌ గెలుస్తానేమో చూడాలి. హార్దిక్‌ ఆడిన తీరుకు చాలా సంతోషంగా ఉంది. మరోవైపు డీకే వచ్చీ రాగానే దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీరిద్దరి బ్యాటింగ్‌ మాకు సానుకూలంగా మారింది. ఇక వ్యక్తిగతంగా నేను మెరుగవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటా. నా బ్యాటింగ్‌ విషయంలో ఆందోళన లేదు.. కానీ, సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకొని మెరుగవ్వడానికి ప్రయత్నిస్తా. బెంగళూరులో చివరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి 100 శాతం కృషి చేస్తాం’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు