ధోని సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉంది: దీపక్‌ హుడా

టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉందని యువ ఆటగాడు దీపక్‌ హుడా అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం..

Published : 04 Feb 2022 02:21 IST

(Photo : CSK, PBKS Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉందని యువ ఆటగాడు దీపక్‌ హుడా అన్నాడు. వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం ఇటీవల ప్రకటించిన భారత జట్టులో దీపక్‌ హుడా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.

‘ఐపీఎల్‌లో నేను పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్నా.. వ్యక్తిగతంగా నా ఫేవరెట్‌ జట్టు మాత్రం చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే). చెన్నై కెప్టెన్‌ ధోనికి డై హార్డ్ ఫ్యాన్‌ని. చాలా సార్లు అతడితో మాట్లాడాను. అతడి సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉంది. త్వరలో జరుగనున్న ఐపీఎల్‌ మెగా వేలం గురించి నేను ఏ మాత్రం ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఫిబ్రవరి 6న ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్‌ గురించే’ అని దీపక్‌ హుడా పేర్కొన్నాడు. చాలా కాలంగా ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున ఆడుతున్న దీపక్‌ హుడా.. వెస్టిండీస్‌తో జరుగనున్న సిరీస్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. 

కుంబ్లే సర్‌ వల్లే మరింత మెరుగయ్యా..

(Photo : PBKS Twitter)

‘గత రెండేళ్లుగా అనిల్ కుంబ్లే సర్‌తో కలిసి పని చేసే అద్భుత అవకాశం దొరికింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్లో అతడో లెజెండ్‌. ఆయనతో ఒక్క ముక్క మాట్లాడినా.. ఎన్నో విషయాలు తెలుస్తాయి. పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించడం వల్లే.. నా ఆటతీరు మెరుగుపడింది. జట్టులో నా పాత్రేంటో చాలా స్పష్టంగా వివరించాడు. అందుకు అనుగుణంగా నా ఆటతీరులో కొన్ని మార్పులు చేశాడు. చాలా కాలంగా దేశవాళీ క్రికెట్‌ ఆడకున్నా.. ఐపీఎల్‌లో రాణించగలుగుతున్నానంటే అందుకు ప్రధాన కారణం కుంబ్లే సర్‌’ అని దీపక్‌ హుడా చెప్పాడు. ఐపీఎల్‌లో దీపక్‌.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్‌)‌, పంజాబ్‌ కింగ్స్‌ (పీబీకేఎస్‌) జట్ల తరఫున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని