Riyan-Abhishek: పరాగ్‌ స్పెషల్‌.. అభిషేక్‌ ఆనందం.. జింబాబ్వే టూర్‌ వేళ యువ భారత్‌ ముచ్చట్లు

టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వే పర్యటనకు భారత ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ జట్టును అక్కడికి పంపించింది.

Published : 03 Jul 2024 18:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ముగిసిన తర్వాత భారత జట్టు మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. జింబాబ్వేతో శనివారం నుంచి ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్‌ఇండియా (ZIM vs IND) ఆటగాళ్లు కొందరు జింబాబ్వేకి బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని క్రికెటర్లు నలుగురు ఉన్నారు. వారే అభిషేక్ శర్మ, రియాన్‌ పరాగ్‌, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, తుషార్‌ దేశ్‌పాండే. వీరిలో రియాన్, అభిషేక్, తుషార్ జింబాబ్వేకి పయనం కాగా.. మిగతా ఇద్దరూ కాస్త ఆలస్యంగా జట్టుతోపాటు చేరతారు. ఈ సందర్భంగా తమకు టీమ్‌ నుంచి పిలుపు రావడంపై స్పందించారు. ఆ వీడియోను బీసీసీఐ (BCCI) తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 

అప్పటికే నా పేరంట్స్ ఇంటర్వ్యూలతో బిజీ: అభిషేక్

‘‘జట్టుకు ఎంపికైన తర్వాత శుభ్‌మన్‌ గిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. చాలా ఆనందమేసింది. ఫస్ట్ టైమ్‌ టీమ్‌కు సెలెక్ట్‌ కావడంతో ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ, నేను ఇంటికి వెళ్లేటప్పటికే నా పేరంట్స్‌ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అది చూసి చాలా గర్వపడ్డా. క్రికెట్ ఆడటం ప్రారంభించిన తొలి రోజు నుంచే.. టీమ్‌ఇండియాకు ఆడటం కలగాపెట్టుకొన్నా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తీవ్రంగా శ్రమించా. జింబాబ్వే పర్యటనకు వెళ్తానని అనుకోలేదు’’ అని అభిషేక్ (Abhishek Sharma) తెలిపాడు. 

జట్టే కొత్త.. అంతా పాతవాళ్లే: రియాన్

‘‘నేను భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. కానీ, టీమ్‌లోని అందరితోనూ ఆడిన అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా. చాలా ఏళ్లు క్రికెట్‌ ఆడినప్పటికీ ఇప్పటికి పిలుపువచ్చింది. భారత జట్టు జెర్సీని ధరించడం భలేగా ఉంది. ఈ ఉత్సాహంలో పాస్‌పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. ఇప్పుడు దొరికాయి. అస్సాం నుంచి వచ్చిన ఓ కుర్రాడికి ఇలాంటి ఛాన్స్‌ రావడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక జింబాబ్వేతో నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది. నా తొలి మ్యాచ్‌ను అక్కడ ఆడబోతున్నా. అయితే, ఆ కనెక్షన్ ఏంటనేది సీక్రెట్’’ అని రియాన్‌ (Riyan Parag) వ్యాఖ్యానించాడు. అండర్-19 వరల్డ్‌ కప్‌ 2018 టోర్నీలో జింబాబ్వేపై రియాన్‌ తన తొలి మ్యాచ్‌ ఆడాడు. కానీ, బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో మాత్రం ఒక్క వికెట్‌ పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని