ఆ హక్కు ఎవరికీ లేదు.. హారిస్‌ రవూఫ్‌కు పాక్ ఆటగాళ్ల మద్దతు

పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ (Haris Rauf) అమెరికాలో ఓ అభిమానితో గొడవ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాక్‌ ఆటగాళ్లు స్పందిస్తూ రవూఫ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 

Updated : 19 Jun 2024 13:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ (Haris Rauf) అమెరికాలో ఓ అభిమానితో గొడవపడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో జట్టు ప్రదర్శనపై ఓ అభిమాని రవూఫ్‌ను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన రవూఫ్‌.. ఆ అభిమాని మీదికి దూసుకెళ్లాడు. రవూఫ్‌ భార్యతోపాటు సమీపంలో ఉన్న వేరే వ్యక్తులు అతడిని నిలువరించాలని చూశారు. ఆ అభిమాని భారతీయుడంటూ రవూఫ్‌ అరుస్తుంటే.. తాను పాకిస్థానీనే అని అతను చెప్పాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న రవూఫ్‌ను చుట్టూ ఉన్న వాళ్లు అతికష్టం మీద ఆపారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ స్పందిస్తూ రవూఫ్‌కు మద్దతుగా నిలిచాడు. 

‘‘ హారీస్ రవూఫ్‌ను అగౌరవపరిచిన వ్యక్తి పాకిస్తాన్‌వాడా, భారత్‌కు చెందినవాడా అనేది అప్రస్తుతం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి (అభిమాని) విలువలు, సంస్కారం లేవు. ఏ వ్యక్తినైనా అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా వారి కుటుంబసభ్యుల ముందు. ఇలాంటి దుర్మార్గపు ప్రవర్తనకు స్వస్తి పలకాలి. ఈ రోజుల్లో సహనం, గౌరవం, కరుణ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి’’ అని మహ్మద్ రిజ్వాన్ ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది కూడా హారిస్‌ రవూఫ్‌కు మద్దతుగా నిలిచారు. అభిమానులు ఇలాంటి చర్యలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ వ్యక్తి కూడా ఇతరులతో ఇలా వ్యవహరించొద్దన్నారు.

పీసీబీ ఛైర్మన్ మొహసీన్‌ నక్వీ కూడా రవూఫ్‌కు బాసటగా నిలిచారు. ‘ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా జట్టు ఆటగాళ్లపై ఇటువంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. ఇలాంటి వాటిని మేం సహించబోము. ఈ విషయంతో ప్రమేయం ఉన్నవారు వెంటనే హారిస్ రవూఫ్‌కి క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని మొహసీన్‌ నక్వీ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.

నా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను

అభిమానితో గొడవపై రవూఫ్‌ ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడినందుకే తాను ఆ వ్యక్తితో గొడవపడినట్లు అతను చెప్పాడు. ‘‘ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోకి తీసుకురావాలనుకోలేదు. కానీ వీడియో బయటికి వచ్చింది కాబట్టి ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. మేం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. మాకు మద్దతుగా నిలవొచ్చు లేదా విమర్శించొచ్చు. కానీ నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికివస్తే స్పందించకుండా ఉండలేను’’ అని రవూఫ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని