WTC Final: ఇలా కాదు బౌలింగ్‌ చేసేది 

న్యూజిలాండ్‌తో తలపడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ చేసిన విధానం సరిగ్గా లేదని, చాలా దారుణంగా ఉందని మాజీ పేసర్‌ రోజర్‌ బిన్నీ అభిప్రాయపడ్డాడు.

Published : 26 Jun 2021 01:29 IST

భారత బౌలర్లపై మండిపడ్డ మాజీ పేసర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో తలపడిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌ చేసిన విధానం సరిగ్గా లేదని, చాలా దారుణంగా ఉందని మాజీ పేసర్‌ రోజర్‌ బిన్నీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో బౌలింగ్‌ చేసే పద్ధతి ఇది కాదని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన భారత బౌలర్లపై మండిపడ్డాడు. ఫైనల్‌లో టీమ్ఇండియా బౌలింగ్‌ చేసిన విధానం సరైనది కాదన్నాడు. చాలా ఘోరంగా బౌలింగ్ చేశారని చెప్పాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు ఎలా చేశారో చూడలేదా అని ప్రశ్నించాడు. అసలు ఇదేం ప్రదర్శన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘బౌలింగ్‌ చేసేటప్పుడు బంతులు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాలి. ఇంగ్లాండ్‌లో బౌలింగ్‌ చేయడం ఇలా కాదు. వీళ్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. కివీస్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌కు ఎలా బౌలింగ్ చేశారు? టీమ్‌ఇండియా ఎలా వేసింది? ఇక్కడ ఆడేది టెస్టు క్రికెట్‌. ఎవరైనా బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా బంతి పిచ్‌ అవ్వాలి. అంతేకానీ బౌలర్ల వైపు పిచ్‌ అవ్వకూడదు. వాళ్లు షాట్లు ఆడాలి. మీరెంత షార్ట్‌పిచ్‌ బంతులేస్తే బంతి అంత అధికంగా సీమ్‌ అవుతుంది. నేరుగా వికెట్లకేసి విసరాలి. అంతేకానీ ప్రత్యర్థులకు అనుకూలంగా వేయొద్దు. కానీ టీమ్‌ఇండియా బౌలర్లు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవాలని మాత్రమే చూశారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడ టీమ్‌ఇండియా బౌలర్లు చేయాల్సింది ఏమిటంటే.. ప్రత్యర్థులు ఎలా బౌలింగ్‌ చేస్తున్నారో గమనించి, అలాగే వారి బ్యాట్స్‌మెన్‌కు బంతులేయాలి. టీమ్‌ఇండియా బౌలర్లు కొత్తవాళ్లు కాదు. మన బ్యాట్స్‌మెన్‌ ఆడుతుంటే కివీస్‌ బౌలర్లు ఎలా బంతులేశారో చూసి నేర్చుకోవాలి’ అని మాజీ పేసర్‌ తీవ్రంగా స్పందించాడు.

కాగా, ఈ ఫైనల్‌లో టీమ్‌ఇండియా జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాతో బరిలోకి దిగింది. అయితే కీలకమైన బుమ్రా ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. మరోవైపు షమి, అశ్విన్‌ నాలుగేసి వికెట్లు తీయగా.. ఇషాంత్‌ మూడు, జడేజా ఒక వికెట్‌ తీశారు. ఇక న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌట్‌ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే భారత బౌలర్ల వైఫల్యంపై బిన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని