Roger Federer : ఉక్రెయిన్‌ చిన్నారుల విద్య కోసం ఫెదరర్‌ 5 లక్షల డాలర్ల వితరణ

రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిన్నారుల పరిస్థితి తీవ్రంగా..

Published : 19 Mar 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌ పరిస్థితులపై ట్విటర్ వేదికగా రోజర్‌ ఫెదరర్‌ స్పందించాడు. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ చిన్నారుల విద్యకు బాసటగా నిలుస్తానని వెల్లడించాడు. తన ఫౌండేషన్‌ ద్వారా 5 లక్షల డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ‘‘ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన చిత్రాలను చూసి నేను, నా కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యాం. అమాయక ప్రజల కోసం నా వంతుగా సాయమందిస్తా. శాంతి కోసం నిలబడతాము’’ అని ట్వీట్ చేశాడు. 

‘‘ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన పిల్లలకు సహాయం అందిస్తాం. సుమారుగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌ చిన్నారులు బడికి దూరమయ్యారు. ఇదొక విపత్కర పరిస్థితి అని తెలుసు. విద్యను అందించడానికి కృషి చేస్తాం. అత్యంత బాధాకరమైన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి వారికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. రోజర్‌ ఫెదరర్ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర పాఠశాల విద్య కోసం 5 లక్షల డాలర్లను ఖర్చు చేయనున్నాం’’ అని ప్రకటనలో రోజర్‌ ఫెదరర్‌ వెల్లడించాడు. గత పాతిక రోజులుగా ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా సైనికులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని