Tokyo Olympics: ఐఏటీఏ తప్పుదోవ పట్టించింది

టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో చోటు దక్కకపోవడంపై భారత టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ విభాగంలో పోటీపడేందుకు తనకూ, సుమిత్‌ నగల్‌కు అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌...

Updated : 17 Sep 2022 16:49 IST

టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌పై రోహన్‌ బోపన్న ఆవేదన..

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో చోటు దక్కకపోవడంపై భారత టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఆల్‌ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఏఐటీఏ) తమను మోసం చేసిందని అన్నాడు. ఆ విభాగంలో పోటీపడేందుకు తనకూ, సుమిత్‌ నగల్‌కు అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీఎఫ్‌) ఎప్పుడూ అనుమతులు ఇవ్వడానికి అంగీకరించలేదని, కానీ ఏఐటీఏ మాత్రం ఇంకా తమకు అవకాశం ఉందంటూ చెబుతూ వచ్చిందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల నామినేషన్ల ప్రక్రియలో చివరి తేదీ అయిన జూన్‌ 22 తర్వాత ఎలాంటి మార్పులూ ఉండబోవని ఐటీఎఫ్‌ ముందే స్పష్టం చేసిందని, కానీ తమకింకా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఏఐటీఏ ఆటగాళ్లను, ప్రభుత్వాన్ని, మీడియాను తప్పుదోవ పట్టించిందని బోపన్న సోమవారం ఓ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై సానియా మీర్జా విచారం వ్యక్తం చేసింది. బోపన్న చెప్పింది నిజమై అయితే ఇది చాలా దారుణమైన విషయమని పేర్కొంది. ఇదో సిగ్గుమాలిన చర్య అంటూ ఏఐటీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక పతకం కోల్పోయిందని మండిపడింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో సుమిత్‌ నగల్‌తో పాటు బోపన్న పేరును కూడా నామినేషన్‌ చేశామని ఏఐటీఏ తమతో పేర్కొందని గుర్తుచేసుకుంది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన ఏఐటీఏ సెక్రటరీ జనరల్‌ అనిల్‌ ధూపర్‌.. బోపన్నపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఇతర ఆటగాళ్లు తప్పుకుంటే తమకు అవకాశాలొస్తాయని క్రీడాకారులు భావించొద్దని, బోపన్నకు నిజంగా సత్తా ఉంటే వేరే వాళ్లపై ఎందుకు ఆధారపడ్డారని ప్రశ్నించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి విషయంలో తాము తీవ్రంగా కృషి చేశామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని