Harmeet Singh: రోహిత్ కోచ్‌ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్‌ను మార్చింది ఆయనే: హర్మిత్‌ సింగ్

భారత అండర్-19 వరల్డ్‌ కప్‌లో ఆడిన ఓ కుర్రాడు.. ఇప్పుడు యూఎస్‌ఏ జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలిసారి సూపర్-8కి ఆ జట్టు దూసుకెళ్లడం గమనార్హం.

Published : 17 Jun 2024 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) వంటి మెగా టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన యూఎస్‌ఏ (USA Cricket Team) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. భారత్‌పై ఓడినప్పటికీ పాకిస్థాన్‌, కెనడాను చిత్తు చేసిన యూఎస్‌ఏ ‘సూపర్‌-8’కి దూసుకొచ్చింది. ఆ జట్టులో కెప్టెన్ మోనాంక్‌ పటేల్‌, సౌరభ్‌ నేత్రావల్కర్, హర్మిత్‌ సింగ్, నితీశ్ కుమార్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరంతా భారత మూలాలు కలిగిన క్రికెటర్లే. ఇందులో హర్మిత్ సింగ్‌కు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు.. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ చిన్ననాటి కోచ్‌ ఒకరే కావడం విశేషం. ఇదే విషయాన్ని తాజాగా హర్మిత్ సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఈ 31 ఏళ్ల క్రికెటర్ భారత్‌ తరఫున అండర్-19 ప్రపంచ కప్‌ల్లోనూ ఆడాడు. యూఎస్‌ఏకు వచ్చే ముందు ముంబయి జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. 

‘‘ఇంతటి గొప్ప ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా దినేశ్‌ లాడ్‌ సర్‌కు థాంక్స్‌ చెబుతున్నా. నా ప్రతిభను గుర్తించిన మొదటి గురువు ఆయనే. రోహిత్ శర్మ చదివిన పాఠశాలలోనే నేను చదివా. రోహిత్‌కు మెంటార్‌, కోచ్‌గా ఉన్న ఆయనే క్రికెట్‌లో పాఠాలు నేర్పారు. నేనా ఆ పాఠశాలలో చేరడానికి కూడా ఆయనే కారణం. ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్‌గా నిలిచారు. వెంటనే స్వామి వివేకానంద పాఠశాలకు మారిపోయా. మేం చాలా రికార్డులను బ్రేక్ చేశాం. దానిని గుర్తు చేసుకుంటే ఇప్పుడంతా ఓ కలగా ఉంది. మేం ఏం సాధించినా సరే.. లాడ్‌ సర్‌ లేకుండా ఉంటే కష్టమయ్యేది. 

క్రికెట్ పట్ల కోచ్ లాడ్‌కు ఉన్న అభిరుచి అద్భుతం. ఆయన నిబద్ధత మాటల్లో చెప్పలేం. మేం మెరుగైన క్రికెటర్లుగా మారడానికి మమ్మల్ని వేరే కోచ్‌ల వద్దకు తీసుకెళ్లేవారు. శివాజీ పార్క్‌ జింఖానా మైదానం నుంచి పద్మాకర్‌ శివాల్కర్‌, ప్రవీణ్‌ ఆమ్రె వద్దకు తీసుకెళ్లేవారు. భారత్ తరఫున అండర్‌-19 ప్రపంచ కప్‌లోనూ ఆడగలిగా. ఆ తర్వాత ముంబయికి ప్రాతినిధ్యం వహించా. ఇప్పుడు యూఎస్‌ఏ జట్టులో ఉన్నా. ఇదంతా దినేశ్‌ లాడ్‌ సర్‌ వల్లేనని బలంగా చెప్పగలను’’ అని హర్మిత్ వెల్లడించాడు. సూపర్-8లో భాగంగా జూన్ 19న దక్షిణాఫ్రికాతో యూఎస్‌ఏ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని