T20 World Cup: రోహిత్‌ వన్‌డౌన్‌ - సచిన్‌ సంఘటనతో పోలిక: వీరేంద్ర సెహ్వాగ్

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మకు బదులు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడంపై ...

Published : 03 Nov 2021 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మకు బదులు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడంపై మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతోనే కివీస్‌ మీద భారత్‌ ఓడిపోయిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ టీమ్‌ఇండియా బ్యాటింగ్ కూర్పుపై స్పందించాడు. కివీస్‌తో  మ్యాచ్‌లో తీసుకున్న ఓపెనర్‌ మార్పు.. 2007 వన్డే ప్రపంచకప్‌లో సచిన్‌ తెందూల్కర్‌ను నాలుగోస్థానంలో పంపించాలనే నిర్ణయంలాంటిదేనని వ్యాఖ్యానించాడు. రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని భారత్‌ జట్టు అప్పుడు గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 

తొలుత సచిన్‌-గంగూలీ జోడీ ఓపెనింగ్‌ చేసేది. ఎప్పుడైతే సెహ్వాగ్‌ వచ్చాడో అప్పటి నుంచి సచిన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేవాడు. ఈ రెండు జోడీలు హిట్టే. ప్రత్యర్థిపై ఆరంభ ఓవర్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. 2007 వన్డే ప్రపంచకప్‌ గురించి సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘‘లక్ష్య ఛేదనలో సూపర్‌గా ఆడుతున్నాం. వరుసగా 17 మ్యాచుల్లో ఛేజింగ్‌ చేసి విజయం సాధించాం. అలాంటిది 2007 వన్డే వరల్డ్‌కప్‌లో రెండు పొరపాట్లు చేశాం. మా కోచ్‌ (గ్రెగ్‌ ఛాపెల్‌) అందరికి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ఉండాలని చెప్పాడు. అయితే రెండు మ్యాచ్‌లు గెలిచాక సూపర్‌-8కి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన ఆరు మ్యాచుల్లో మార్పులు చేద్దామని చెప్పా. అయితే కోచ్‌ అలా కుదరదు అని చెప్పాడు. అప్పటికే సచిన్‌ మిడిలార్డర్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేనేలేదు. ద్రవిడ్, యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్ ధోనీ ఉన్నారు. జట్టు బాగా ఆడనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోవాలి. అప్పుడు బాగా ఎందుకు ఆడరు? అంతేకాని జట్టులో మార్పులు చేయడం సరైంది కాదు’’ అని వివరించాడు. బెర్ముడా, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కూడిన గ్రూప్‌లో భారత్‌ ఉంది. అయితే బెర్ముడా మీద భారీ విజయం (257 పరుగుల తేడా) సాధించిన టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌, లంక చేతిలో ఓటమిపాలై గ్రూప్‌ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. టాప్‌ ఆటగాళ్లు ఉన్న భారత్‌ ఇలా కావడానికి ప్రధాన కారణం అప్పటి హెడ్‌ కోచ్ గ్రెగ్‌ ఛాపెల్‌ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోచ్‌తోపాటు రాహుల్‌ ద్రవిడ్‌ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. 2007 టీ20 ప్రపంచకప్‌కు ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జట్టును పంపింది. తొలి టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తుకున్న ధోనీ.. ఆ తర్వాత నాయకుడిగా ఉన్నత శిఖరాలకు ఎదిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని