Rohit Sharma: కెప్టెన్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

రోహిత్‌ శర్మ టీ20ల్లో సగం ఓవర్లు క్రీజులో నిలిచినా చాలు.. ప్రత్యర్థి జట్ల పనైపోతుంది. కానీ అంతసేపు అతను నిలవడమే కష్టం. కీలక మ్యాచ్‌ల్లో త్వరగా ఔటైపోతాడని పేరున్న హిట్‌మ్యాన్‌..

Updated : 25 Jun 2024 07:16 IST

రోహిత్‌ శర్మ టీ20ల్లో సగం ఓవర్లు క్రీజులో నిలిచినా చాలు.. ప్రత్యర్థి జట్ల పనైపోతుంది. కానీ అంతసేపు అతను నిలవడమే కష్టం. కీలక మ్యాచ్‌ల్లో త్వరగా ఔటైపోతాడని పేరున్న హిట్‌మ్యాన్‌.. సోమవారం చరిత్రలో నిలిచిపోయే టీ20 ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో ఓవర్లోనే కోహ్లి వికెట్‌ కోల్పోయి ఢీలా పడ్డ భారత్‌ను అతను తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. నాణ్యమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను అతను ఊచకోత కోసిన తీరు అసామాన్యం. ఆరంభంలోనే వికెట్‌ పడ్డాక మిగతా బ్యాటర్లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేసి ఉంటే.. కంగారూ బౌలర్లను కాచుకోవడం కష్టమయ్యేది. రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్‌ చేసి మరింత ఒత్తిడిలోకి నెట్టి భారత్‌ను చుట్టేసేవాళ్లు. కానీ రోహిత్‌ ఆస్ట్రేలియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. కళ్లుచెదిరే షాట్లతో బౌలర్ల గణాంకాలను చెల్లా చెదురు చేశాడు. రోహిత్‌ విధ్వంసంతో మిగతా బ్యాటర్లకు కూడా స్వేచ్ఛగా ఆడేందుకు లైసెన్స్‌ లభించింది. రోహిత్‌ మూడంకెల స్కోరు కూడా అందుకుని ఉంటే అభిమానులు మరింత ఆనందించేవారు. కానీ సెంచరీ కాకపోయినా.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ తరఫున మేటి టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా ఇది నిలుస్తుందనడంలో సందేహం లేదు.

స్టార్క్‌కు చుక్కలు: ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడైన స్టార్క్‌కు రోహిత్‌ చుక్కలు చూపించేశాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో తొలి 4 బంతులకు 6, 6, 4, 6 బాదిన రోహిత్‌.. చివరి బంతికి 6 కొట్టాడు. ఈ ఓవర్లో మొత్తం 29 పరుగులు వచ్చాయి. ఈ ఊచకోత భారత అభిమానులకు చాన్నాళ్లు గుర్తుంటుంది. అయితే తర్వాత రెండో స్పెల్‌లో బౌలింగ్‌కు వచ్చిన స్టార్క్‌.. సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్‌ను బౌల్డ్‌ ముందు జరిగిన పరాభవానికి కాస్త ప్రతీకారం తీర్చుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని