IPL - 2022 : హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నా.. కలిసొచ్చేదేం లేదు : రోహిత్‌ శర్మ

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ - 2022కు సంబంధించిన మ్యాచులు హోమ్‌ గ్రౌండ్లో జరుగుతున్నా.. తమకు అదనంగా కలిసొచ్చేదేమీ లేదని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని..

Published : 24 Mar 2022 01:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ - 2022కు సంబంధించిన మ్యాచులు హోమ్‌ గ్రౌండ్లో జరుగుతున్నా.. తమకు అదనంగా కలిసొచ్చేదేమీ లేదని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని.. వారిలో చాలా మందికి ఇంతకు ముందు ముంబయిలో ఆడిన అనుభవం లేదని పేర్కొన్నాడు. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోచ్‌ మహేల జయవర్ధనెతో కలిసి రోహిత్‌ మాట్లాడాడు. ఆ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.

‘మా జట్టులో చాలా మార్పులు వచ్చాయి. వేలం ద్వారా చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. నాతో పాటు సూర్యకుమార్ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఇంతకు ముందు ఇక్కడ మ్యాచులు ఆడాం. మిగతా ఆటగాళ్లలో ఎవరికీ ఇక్కడ ఆడిన అనుభవం లేదు. మరోవైపు, గత రెండేళ్లుగా మేం ముంబయిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అందుకే ప్రస్తుత సీజన్‌లో సొంత మైదానాల్లో మ్యాచులు జరిగినా.. మాకు కలిసొచ్చేదేం లేదు’ అని రోహిత్‌ శర్మ చెప్పాడు.

‘ప్రస్తుతం, సూర్యకుమార్‌ నేషనల్‌ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్నాడు. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ వచ్చిన వెంటనే అతడు అందుబాటులోకి వస్తాడు. అయితే, తొలి మ్యాచ్‌లో  ఆడతాడా.? లేదా.? అనే విషయంలో స్పష్టత లేదు’ అని రోహత్‌ పేర్కొన్నాడు. మరోవైపు, యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా బరిలోకి దింపుతామని రోహిత్ స్పష్టతనిచ్చాడు. ఐపీఎల్-2022 సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ వాంఖడే, బ్రాబౌర్న్‌, డీవై పాటిల్, పుణె మైదానాల్లో జరుగనున్నాయి. మార్చి 27న దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబయి తలపడనుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని