Rohit Sharma: డీకే బ్యాటుతో తొలి 50 కొట్టిన రోహిత్‌

అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ శర్మ తన బ్యాటుతోనే అర్ధశతకం సాధించాడని వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో తాను డకౌట్‌ అవ్వడంతో బ్యాటును తిట్టుకున్నానని తెలిపాడు....

Published : 01 Jun 2021 18:12 IST

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ తన బ్యాటుతోనే అర్ధశతకం సాధించాడని వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో తాను డకౌట్‌ అవ్వడంతో బ్యాటును తిట్టుకున్నానని తెలిపాడు. అప్పుడు రోహిత్‌ ఆ బ్యాటును అడిగి తీసుకొని మరీ అర్ధశతకం బాదేశాడని గుర్తు చేసుకున్నాడు.

డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా ఆ మ్యాచులో తలపడింది. షాన్‌ పొలాక్‌ వేసిన ఐదో ఓవర్లో డీకే గోల్డెన్‌ డకౌట్‌ కావడంతో బ్యాటును తిట్టుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ అదే బ్యాటుతో 40 బంతుల్లోనే అజేయ అర్ధశతకం అందుకున్నాడు. ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదేశాడు. ఎంఎస్‌ ధోనీతో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

‘రోహిత్‌ తన మొదటి అంతర్జాతీయ అర్ధశతకాన్ని నా బ్యాటుతోనే అందుకున్నాడు. అందుకు నేనెంతో గర్విస్తున్నా. అవును, నేను దాంతోనే బ్యాటింగ్‌ చేశాను. ఈ బ్యాటు నన్ను తిప్పలు పెడుతోందంటూ రోహిత్‌కు చెప్పాను. ఏంటి? ఈ బ్యాటు బాగా లేదంటావా? నాకివ్వు అంటూ హిట్‌ మ్యాన్‌ బదులిచ్చాడు. దాంతో నేనతడికి బ్యాటు ఇచ్చాను. అతడు నేరుగా అదే బ్యాటుతో మైదానంలోకి వెళ్లి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ ఘనత నా బ్యాటుది కాదు. ఆడిన బ్యాట్స్‌మన్‌దే. కానీ అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఎంతో బాగుంటుంది. ఆ విషయాలు నాకెంతో విలువైనవి’ అని డీకే అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని