IND vs WI : పది ఓవర్ల ఆట తర్వాత.. మేం 190 స్కోరు సాధిస్తామని అనుకోలేదు: రోహిత్

విండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో...

Updated : 30 Jul 2022 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్: విండీస్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో  68 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (64), దినేశ్‌ కార్తిక్ (41*) ధాటిగా ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ 190/6 స్కోరు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో విండీస్‌ 122/8కే పరిమితమైంది. తొలి పది ఓవర్లకు 88 పరుగులే చేసిన టీమ్‌ఇండియా ఆఖరికి 190 సాధించిందంటే దానికి కారణం దినేశ్ కార్తిక్. భారత టీ20 లీగ్‌లో చివర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడిన కార్తిక్‌ మరోసారి తన సత్తా చాటి ప్రపంచకప్‌ జట్టులో తానెంత కీలకమో తెలియజేశాడు. 

మ్యాచ్‌ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించలేదు. మంచి ఆరంభం సాధించడం సులువేం కాదని తెలుసు. అయితే మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. మేం తొలి పది  ఓవర్లు పూర్తి అయినప్పుడు ఆఖరికి 190 స్కోరును సాధిస్తామని అనుకోలేదు. కానీ బ్యాటర్లు అద్భుత ఫినిషింగ్‌ ఇచ్చారు. మూడు కోణాల్లోనూ పరిణితి సాధించాలని భావించాం. అందుకు తగ్గట్టుగానే తొలుత బ్యాటింగ్‌లో మంచి స్కోరు సాధించగలిగాం. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ సత్ఫలితాలను రాబట్టాం. పిచ్‌ నుంచి సహకారం లేకపోవడంతో క్రీజ్‌లో నిలబడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌ చేయడం అంత సులువేం కాదు. అప్పుడే ఆటగాళ్ల నైపుణ్యం, బలాలు బయటకు వస్తాయి. విండీస్‌లో ఆడటం నాకెప్పుడూ ఇష్టమే. భారత జట్టుకు అపూర్వ మద్దతు లభిస్తూ ఉంటుంది. విండీస్‌ నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా ప్రవాస భారతీయులు మ్యాచ్‌లను చూసేందుకు రావడం ఆనందంగా ఉంది’’ అని వివరించాడు. 

ఇలా ఆడాలంటే ప్రాక్టీస్‌ చాలా కీలకం: కార్తిక్

టీ20 ప్రపంచ కప్‌ మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో విండీస్‌తో మ్యాచ్‌లను ప్రయోగాలు చేసేందుకు టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వినియోగించడం విశేషం. అందులో భాగంగానే రోహిత్‌కు తోడుగా ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను పంపించాడు. అయితే సూర్యకుమార్‌ కూడా కేవలం 16 బంతుల్లోనే 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఖర్లో చెలరేగిన దినేశ్‌ కార్తిక్ 19 బంతుల్లో 41 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పిచ్‌ మీద బ్యాటింగ్‌ చేయడం సులువేం కాదు. అయితే నేను ఇలాంటి పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా ఉంది. కోచ్‌, కెప్టెన్‌తో సహా జట్టు సభ్యుల నుంచి మద్దతు చాలా అవసరం. అదే నాకు చాలా హెల్ప్‌ అయింది. పిచ్‌ను అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా షాట్లను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా తీవ్రంగా సాధన చేస్తేనే వస్తుంది’’ అని కార్తిక్‌ తెలిపాడు.

* విండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత సారథి రోహిత్ శర్మ (64) సూపర్ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,399)ను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ (3,443) రికార్డు సృష్టించాడు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ (3,308), ఐర్లాండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్‌ (2,984), ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ (2,855) టాప్‌-5లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని