Hardik Pandya : హార్దిక్‌.. నీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు ‘టేక్‌ ఏ బౌ’

గత టీ20 ప్రపంచకప్‌ ఓటమికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా సూపర్‌ విక్టరీ సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్‌ఇండియా...

Updated : 29 Aug 2022 11:00 IST

వైరల్‌గా మారిన రోహిత్, కార్తిక్‌ ఫొటోలు

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: గత టీ20 ప్రపంచకప్‌ ఓటమికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా సూపర్‌ విక్టరీ సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమ్‌ఇండియా ఐదు వికెట్లను మాత్రమే నష్టపోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించాడు. మొదట పాక్‌ను కట్టడి చేయడంలో భువనేశ్వర్‌ (4/26)కు తోడుగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (3/25) కీలక పాత్ర పోషించాడు. క్రీజులో కుదురుకున్న  ఓపెనర్‌ రిజ్వాన్‌ (43), ఇఫ్తికార్‌ అహ్మద్ (28)తోపాటు ఖుష్‌దిల్‌ (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికే రిజ్వాన్- ఇఫ్తికార్‌ 45 పరుగులు జోడించి మంచి ఊపు మీదున్నారు. షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో విఫలమవుతున్న పాక్‌ బ్యాటర్లను ఆ అస్త్రంతోనే బోల్తా కొట్టించాడు. గత భారత టీ20 లీగ్‌ ముందు వరకు బౌలింగ్‌ వేసేందుకు ఇబ్బంది పడి విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్‌ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. పాక్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాండ్య బౌలింగ్‌ను మెచ్చుకుంటూ కెప్టెన్‌ రోహిత్ శర్మ చేతులు కలిపిన ఫొటో వైరల్‌గా మారింది. 

టెన్షన్ వద్దు.. నేను చూసుకుంటా

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఒక్క పరుగుకే తొలి వికెట్‌ డౌన్‌.. అయితే విరాట్ కోహ్లీ (35), రోహిత్ శర్మ (12) స్కోరు బోర్డును నడిపించారు. ఆ తర్వాత.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరిపోయారు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్ (18) కూడా ఔటయ్యాడు. మరోవైపు రవీంద్ర జడేజా (35) క్రీజ్‌లో పాతుకుపోయి ఆడుతున్నాడు. ఇలాంటి సమయంలో మరొక వికెట్‌ పడి ఉంటే భారత్‌ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ హార్దిక్‌ పాండ్య (33*: 17 బంతుల్లో) ఏమాత్రం వెరవకుండా పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జడేజాతో కలిసి 52 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశాడు. భారీ ఒత్తిడి ఉండే ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టేసి టీమ్‌ఇండియాపై భారాన్ని కాస్త దించేశాడు.

(ఫొటో సోర్స్‌: ట్విటర్)

కానీ.. అనూహ్యంగా చివరి ఓవర్‌లో  అసలైన డ్రామా మొదలైంది. మొదటి బంతికే జడేజా ఔట్‌ కావడం.. తర్వాతి రెండు బంతులకు ఒక పరుగే రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఇద్దరు హిట్టర్లు (పాండ్య, దినేశ్‌ కార్తిక్) క్రీజ్‌లో ఉండటం భారత్‌కు ఊరటలా అనిపించింది. కార్తిక్‌ సింగిల్‌ కోసం రమ్మని పిలిచినా.. ఏమాత్రం బెదరని పాండ్య ‘నేను చూసుకుంటా.. వదిలేయ్‌’ అన్నట్లు నాలుగో బంతికి పవర్‌ఫుల్‌ షాట్‌ కొట్టాడు. అది బౌండరీ లైన్‌ ఆవల పడటం.. టీమ్‌ఇండియా అభిమానులు కేరింతలు కొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ అద్భుత ఘట్టం ఆవిష్కరించిన  హార్దిక్‌ పాండ్యను నాన్‌స్ట్రైకింగ్‌లోని దినేశ్‌ కార్తిక్‌ ‘టేక్‌ ఏ బౌ’ అంటూ అభినందించాడు. ఆసియా కప్‌ను పాక్‌పై విజయంతో ఘనంగా ప్రారంభించడంతో.. భారత్‌ అభిమానులకు ఇంతకుమించిన సంబరం మరొకటి ఉండదేమో..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని