Updated : 17 Nov 2021 08:22 IST

Rohit Sharma: రోహిత్‌కు తొలి పరీక్ష 

న్యూజిలాండ్‌తో భారత్‌ మొదటి టీ20 నేడు
రాత్రి 7 గంటల నుంచి
జైపూర్‌

కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌! కాస్త కొత్తగా కనిపిస్తున్న జట్టు! టీ20 ప్రపంచకప్‌ పరాభవాన్ని మరిచిపోయి... 2022 ప్రపంచకప్‌పై దృష్టిసారించాలనుకుంటున్న టీమ్‌ఇండియా ఆ దిశగా రంగంలోకి దిగడానికి సిద్ధమైపోయింది. ప్రపంచకప్‌ ఫైనలిస్ట్‌ న్యూజిలాండ్‌తో నేటి నుంచే పొట్టి సిరీస్‌! రోహిత్‌, ద్రవిడ్‌ శకానికి ఇదే ఆరంభం.

కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ హయాంలో తొలి సమరానికి భారత జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20లో భారత్‌.. న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. టీ20 జట్టులో ప్రక్షాళన అవసరమని తాజా ప్రపంచకప్‌తో తెలిసొచ్చిన నేపథ్యంలో.. రోహిత్‌, ద్రవిడ్‌ ద్వయం ఏడాదిలో ఆస్ట్రేలియాలో జరిగే మరో పొట్టి ప్రపంచకప్‌ కోసం జట్టును ఎలా సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరం. యూఏఈ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌ సెమీఫైనల్‌ రేసుకు దూరమైన సంగతి తెలిసిందే.

కూర్పు సవాలే..: పన్నెండు నెలల లోపే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లు ఏమేర ఉపయోగపడతారో అంచనా వేయనున్నారు కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌. ఇప్పుడు జట్టులో అయిదుగురు ఓపెనర్లు ఉన్నారు. కొందరికి మిడిల్‌ ఆర్డర్‌ స్థానాలు కేటాయించడం సవాలే. రోహిత్‌, రాహుల్‌ తొలి టీ20లో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు మెండు. వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఓపెనర్‌గానే ఐపీఎల్‌లో సత్తా చాటాడు. ఇప్పుడు అతడు మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో వస్తాడు. ప్రపంచకప్‌లో ఆకట్టుకోలేకపోయిన అతడు.. ఈసారి చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌లతో భారత లైనప్‌ కాగితంపై బలంగానే ఉంది. జడేజా గైర్హాజరీలో అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించనున్నాడు. యూఏఈలో రాణించిన అశ్విన్‌ తుది జట్టులో స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. దీపక్‌ చాహర్‌, చాహల్‌ కూడా బరిలోకి దిగడం ఖాయం.

కేన్‌కు విశ్రాంతి..
మరోవైపు న్యూజిలాండ్‌కు ఈ సిరీస్‌ సవాలే. ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఆ జట్టుకు వెంటనే భారత్‌కు రావాల్సివచ్చింది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించలేదు. టెస్టు సిరీస్‌కు తాజాగా ఉంచడం కోసం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు ఈ పొట్టి సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇచ్చారు. అతడి గైర్హాజరీలో టిమ్‌ సౌథీ న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. విలియమ్సన్‌ లేకున్నా కివీస్‌ బలంగానే కనిపిస్తోంది. సౌథీ, బౌల్ట్‌, మిల్నెలతో కూడిన పదునైన పేస్‌ విభాగం ఆ జట్టు సొంతం. సోధి, శాంట్నర్‌ల రూపంలో మంచి స్పిన్నర్లూ ఉన్నారు. విలియమ్సన్‌ లేకున్నా కివీస్‌ బ్యాటింగ్‌ కూడా బాగానే ఉంది. ప్రమాదకర ఓపెనర్‌ మిచెల్‌ ఫామ్‌ ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.


వెంకటేశ్‌ ఎలా ఆడతాడో..

యూఏఈలో ఫలితం కారణంగా.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య కాకుండా మరొకరి గురించి ఆలోచించక తప్పనిసరి పరిస్థితి భారత్‌కు ఎదురైంది. హార్దిక్‌ చాలా కాలంగా తన ఆల్‌రౌండ్‌ సామర్థ్యాన్ని చాటలేకపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అతడు ఎదగగలడా లేదా అన్నది ఈ మూడు మ్యాచ్‌లతో సూచనప్రాయంగా తెలియనుంది. భారత్‌కు మరింత పవర్‌ హిట్టర్స్‌ కూడా అవసరమే. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున వెంకటేశ్‌... ఇప్పటికే భారీ షాట్లు ఆడగల తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న మరి కొందరు ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్షల్‌ పటేల్‌, అవేష్‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్‌ కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో నిలకడగా 140 కిలోమీటర్లపై వేగంతో బౌలింగ్‌ చేసే పేసర్‌ కోసం భారత్‌ చూస్తోంది. ఈ నేపథ్యంలో అవేష్‌, సిరాజ్‌లపై అందరి దృష్టి నిలవనుంది. సిరీస్‌లో వీరికి ఎన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లభిస్తుందో చూడాలి. ప్రపంచకప్‌లో అంతగా రాణించలేకపోయిన భువనేశ్వర్‌కు మరో అవకాశం దక్కింది. అతడికి ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైందనడంలో సందేహం లేదు.


పిచ్‌ ఎలా ఉందంటే..

మ్యాచ్‌ వేదిక సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం ఇంతకుముందెప్పుడూ టీ20 మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వలేదు. ఇక్కడ చివరిసారి 2013లో అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. తొలి టీ20 కోసం సిద్ధం చేసిన పిచ్‌పై భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని